యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(UAE) ఏర్పాటు చేయనున్న ఓ భారీ పెట్రోరసాయన కేంద్రంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పశ్చిమ అబుదాబిలో 'రువాయిస్ డెరివేటివ్స్ పార్క్'ను అభివృద్ధి చేయడానికి ఆ దేశ ప్రభుత్వ ఇంధన దిగ్గజం అబుదాబి నేషనల్ ఆయిల్ కో(యాడ్నాక్), ప్రభుత్వ హోల్డింగ్ కంపెనీ ఏడీక్యూలు కలిసి ఇటీవల ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ 'తాజిజ్'లో రిలయన్స్ కూడా భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టులో 1.5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.11,250 కోట్లు) వరకు ఆర్ఐఎల్ పెట్టుబడులు పెట్టవచ్చని సమాచారం.
ఏకీకృత ప్లాంటులో భారీ ఉత్పత్తి
ఒప్పందం కింద తాజిజ్, రిలయన్స్ కలిసి ఏటా 9,40,000 టన్నుల క్లోర్-ఆల్కలి, 1.1 మిలియన్ టన్నుల ఎథిలీన్ డౌక్లోరైడ్, 3,60,000 టన్నుల పీవీసీని ఉత్పత్తి చేసే ఒక ఏకీకృత(రిఫైనరీ, పెట్రోరసాయనాలు) ప్లాంటును ఏర్పాటు చేస్తాయి.