తమ రిటైల్ విభాగంలో నుంచి 10 శాతం వాటాను విక్రయించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గురువారం తెలిపారు. ఈ అమ్మకాల ద్వారా రూ.47వేల కోట్ల నిధులను సమీకరించినట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులకు ఊతం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రిలయన్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్- పీఐఎఫ్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లోని 2.04 శాతం వాటాను 9 వేల 555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మొత్తంతో కలిపి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ విలువ 4.587 లక్షల కోట్లకు చేరింది. గతంలో రిలయన్స్ సంస్థకే చెందిన జియో ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిన సౌదీ సంస్థ పీఐఎఫ్ .. అందులో 2.32శాతం మేర వాటాలు కొనుగోలు చేసింది.
రిలయన్స్ రిటైల్‌లోకి పీఐఎఫ్‌ను ఆహ్వానిస్తున్నట్లు అంబానీ తెలిపారు. సౌదీ అరేబియాతో.. రిలయన్స్‌కు ఏళ్ల తరబడి ఉన్న సంబంధాలు ఈ పెట్టుబడులతో ద్విగుణీకృతమయ్యాయని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 25 నుంచి.. తమ సంస్థలో మొత్తం 10.09 శాతం వాటాను వివిధ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించింది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్). సిల్వర్ లేక్, కేకేఆర్, జీఐసీ, టీపీజీ, జనరల్ అట్లాంటిక్, సావరిన్ వెల్త్ ఫండ్స్ ముబదాల, ఏడీఐఏ, పీఐఎఫ్ సంస్థలు.. ఈ వాటాను సొంతం చేసుకున్నాయి.
"వివిధ కంపెనీలను మా ఆర్ఆర్వీఎల్లో భాగస్వాములను చేసుకోవడం ద్వారా రూ.47,265 కోట్లను ఆర్జించాము. రూ.69.27 కోట్ల విలువ గల ఈక్విటీ షేర్లను ఆ కంపెనీలకు కేటాయించాము."