భారీ అంచనాల నడుమ ఈ నెల 5న జియోఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభించింది రిలయన్స్. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం కేటగిరీలుగా జియో ఫైబర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లన్నింటిలో వార్షిక చందా తీసుకున్న వారికి సెట్‌టాప్ బాక్స్, హోమ్ గేట్వేలు, స్పీకర్లు, 4కే టీవీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఇవి రిలయన్స్ వెల్లడించిన, అందరికీ తెలిసిన ఆఫర్లు.
అయితే రిలయన్స్ బయటకు వెల్లడించని ఎన్నో సదుపాయాలు జియోఫైబర్‌లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఇల్లంతా ఒకే సామర్థ్యంతో వైఫై..
జియో ఫైబర్ రూటర్ల సిగ్నల్ సామర్థ్యం విషయంలో మెష్ పద్ధతిని వినియోగిస్తోంది రిలయన్స్. ఈ మెష్ సాంకేతికతతో పరిమితి మేరకు.. అవసరాన్ని బట్టి సిగ్నల్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంది. ఇంట్లో ఏ మూలకైనా ఒకే సామర్థ్యంతో సిగ్నల్ అందుబాటులో ఉండేలా చేస్తుంది ఈ సాంకేతికత. జియో ఫైబర్ గృహ వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
గెస్టులొస్తే పాస్వర్డ్ చెప్పక్కర్లేదు...
జియోఫైబర్ అందిస్తున్న సరికొత్త ఫీచర్లలో ఇది ఒకటి. జియో వైఫై గెస్ట్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
ఉదాహరణకు.. ఒక వేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారు మీ వైఫై వినియోగించుకోవాల్సిన అవసరం రావచ్చు. ప్రస్తుతం అలాంటి సందర్భాల్లో మీరు పెట్టుకున్న పాస్వర్డ్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది. అయితే.. గెస్టులకు పాస్వర్డ్ చెప్పకుండానే వాళ్లు వైఫై వాడుకునే సదుపాయం అందిస్తోంది జియో. అదెలా అంటే.. గెస్ట్ వైఫై ద్వారా ఒక ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ సృష్టించి వారికి ఇవ్వచ్చు. దీని ద్వారా కేవలం గెస్ట్ యూజర్లు వైఫై వాడుకునేలా చేయడం మాత్రమే కాకుండా.. ఇతరులు అనధికారికంగా మీ వైఫై వాడుకోకుండా చేయొచ్చు.
ఇంటర్‌కామ్ నెట్వర్క్..
జియో ఫైబర్ ఇంటర్‌కామ్ ఫీచర్‌తో మీరు ఉన్న దగ్గరి నుంచే సెక్యురిటీ గార్డ్, రిసెప్షన్లకు ఆదేశాలు పంపొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్‌ను, సెక్యూరిటీ, రిసెప్షన్లో ఉన్న డివైజులను జియో ఫైబర్‌కు అనుసంధానం చేయడం ద్వారా వాటిని లోకల్ నెట్‌వర్క్‌గానూ వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం కోసం ఇంటర్ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగిస్తుండటం గమనార్హం.
డేటా షేరింగ్ మరింత సులభం...
జియో వైఫైకి అనుసంధానమైన అన్ని రకాల డివైజ్‌లకు డేటా షేరింగ్‌ను సదపాయం అందిస్తోంది రిలయన్స్. ఇందుకోసం జియోఫైబర్ వినియోగదారులు జియోహోమ్ యాప్ ద్వారా జియోఫైకి అనుసంధానమైన అన్ని డివైజ్‌లకు వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైళ్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకశముంది.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు