బ్రాడ్‌బాండ్, డీటీహెచ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావిస్తున్న 'జియో గిగా ఫైబర్' ఆవిష్కరణ నిరీక్షణకు త్వరలో తెరపడనుందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి పలు నివేదికలు. వీటి ప్రకారం ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ వాణిజ్య సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. అదే రోజు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. గిగా ఫైబర్ వాణిజ్య సేవల ఆవిష్కరణకు ఇదే సరైన సమయమని రిలయన్స్ భావిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది సర్వసభ్య సమావేశంలో 'జియో గిగా ఫైబర్' సేవలపై ప్రకటన చేసింది రిలయన్స్. తక్షణమే దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో గిగాఫైబర్ కోసం నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా పట్టణాల్లో సంస్థ ఉద్యోగులతో ట్రయల్ నిర్వహిస్తోంది.
గత వారం కీలక ప్రకటన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను గత వారం ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో 'జియో గిగాఫైబర్' బీటా ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్లు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.