ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఏప్రిల్-జూన్‌కు సంతృప్తికర ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.12,273 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,233 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం తక్కువ. అధిక వ్యయాలే ఇందుకు కారణం. మార్చి త్రైమాసిక లాభం రూ.10,845 కోట్లతో పోలిస్తే 13 శాతం ఎక్కువ.
ఆదాయాలు రూ.1.44 లక్షల కోట్లకు:ఏడాది వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ.91,238 కోట్ల నుంచి రూ.1,44,372 కోట్లకు పెరిగాయి. విక్రయాలు, సేవల విలువ 57.4% అధికంగా రూ.1,58,862 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో వ్యయాలు 50% అధికమై కంపెనీ లాభాలను తటస్థీకరించినట్లయింది. పన్ను వ్యయాలు రూ.3464 కోట్లకు; మొత్తం వ్యయాలు రూ.1.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
75% పైగా పెరిగిన ఓ2సీ ఆదాయాలు
కంపెనీకి చెందిన చమురు-రసాయనాల (ఓ2సీ) వ్యాపార ఆదాయాలు రూ.58,906 కోట్ల నుంచి 75.2 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు చేరాయి. ముడిచమురు ధరకు అనుగుణంగా ఉత్పత్తి ధరలూ ప్రియం కావడం ఇందుకు ఉపకరించింది.
రిలయన్స్ రిటైల్
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, రిటైల్ విభాగంలో రెట్టింపు లాభాలొచ్చాయి. నికర లాభం 123.2% పెరిగి రూ.962 కోట్లకు చేరుకుంది. ఆదాయం 19.04% పెరిగి రూ.28,197 కోట్లుగా నమోదైంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 123 విక్రయశాలలు జతై, మొత్తం స్టోర్ల సంఖ్య 12,803కు చేరుకుంది. మరో 700 స్టోర్లను త్వరలోనే తెరవనుంది. కొత్తగా చేరిన ఔషధ విభాగాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు.