జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది రిలయ్సన్ ఇండస్ట్రీస్. ఆన్లైన్ చిల్లర వర్తక రంగంలోనూ ఆ సంస్థ అలాంటి అద్భుతాలే సృష్టించే అవకాశముందని అంచనా వేసింది 'బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్'.
ప్రస్తుతం దేశంలో 15వేల డిజిటల్ చిల్లర దుకాణాలు ఉన్నాయి. ఆన్లైన్ రిటైల్ రంగంలోకి రిలయన్స్ రాకతో ఆ సంఖ్య 2023 నాటికి 50లక్షలకు చేరుతుందని లెక్కగట్టింది బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్. మరికొన్ని ఆసక్తికర అంశాలతో ఓ నివేదిక రూపొందించింది. ఆ వివరాలు...
ఎక్కువ అసంఘటితమే...
భారత్‌లో 90 శాతం(దాదాపు 700 బిలియన్ డాలర్ల) రిటైల్ మార్కెట్ అసంఘటితంగా ఉంది. పెరుగుతున్న పోటీ కారణంగా ఈ కిరాణా దుకాణాలు సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను అమలు తర్వాత డిజిటలీకరణ మరింత అనివార్యమైంది. జీఎస్టీ బిల్లులు ఆన్లైన్లో సృష్టించాల్సి ఉండడం ఇందుకు కారణం.
కిరాణా దుకాణదారుల్లో సాంకేతికత పట్ల మారుతున్న దృక్పథం రిలయన్స్‌కు కలిసి వస్తుందని అంచనా వేసింది బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్.
భారీ ప్రణాళికతో...
రిలయన్స్‌కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,000 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్-టూ-ఆఫ్‌లైన్ ఈ-కామర్స్ వేదికను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.
కిరాణా స్టోర్లలో మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్స్ (ఎంపీఓఎస్) పరికరాన్ని అమర్చాలని భావిస్తోంది రిలయన్స్. వేగవంతమైన 4జీ అంతర్జాల సేవల ద్వారా తమ వినియోగదార్ల ఆర్డర్లును అందుకునేందుకు ఈ పరికరం దుకాణదారులకు ఉపయోగపడుతుంది.