Reliance Bonds Issue: విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా 400 కోట్ల డాలర్లను సమీకరించినట్లు దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ సమీకరణకు మూడు రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించిందని తెలిపింది. ఈ నిధులను ప్రస్తుత రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుంటామని రిలయన్స్ తన నివేదికలో వివరించింది. విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా ఓ భారతీయ కంపెనీ సమీకరించిన అతిపెద్ద మొత్తం ఇదేనని తెలిపింది.
Largest foreign currency bonds issue India
2.875 శాతం వడ్డీ రేటుతో 150 కోట్ల డాలర్లు, 3.625 శాతంతో 175 కోట్ల డాలర్లు 3.75 శాతం వడ్డీతో 75 కోట్ల డాలర్లను సేకరించినట్లు రిలయన్స్ వివరించింది. 2032 నుంచి 2062 కాలం మధ్య ఈ బాండ్ల రీపేమెంట్ ఉంటుందని పేర్కొంది. ఏడాదికి రెండుసార్లు బాండ్లపై వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది.
US treasury bonds Reliance
అమెరికా ట్రెజరీ బెంచ్మార్క్ నిబంధనలకు అనుగుణంగా 120, 160, 170 బేసిస్ పాయింట్లతో బాండ్లను జారీ చేసినట్లు రిలయన్స్ తెలిపింది. దీంతో భారీ స్థాయిలో బాండ్లు జారీ చేసిన ఆసియా కంపెనీల జాబితాలో రిలయన్స్ చేరినట్లైంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని 200కు పైగా ఖాతాల నుంచి ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. 53 శాతం ఆసియా, 14 శాతం ఐరోపా, 33 శాతం అమెరికా ఖాతాదారులకు బాండ్లు జారీ అయ్యాయని వివరించింది.
ఈ సమీకరణ రికార్డులు..
- భారత్ నుంచి జారీ అయిన విదేశీ కరెన్సీ బాండ్లలో ఇదే అతిపెద్దది.
- బీబీబీ రేటింగ్ ఉన్న ఆసియా(జపాన్ మినహా) కంపెనీలలో 30 ఏళ్లు- 40 ఏళ్ల కాలానికి జారీ అయిన బాండ్లలో అతి తక్కువ కూపన్ ఉన్న బాండ్లు ఇవే.
- ఆసియా(జపాన్ మినహా)లోని బీబీబీ ప్రైవేట్ కంపెనీ 40 ఏళ్ల కాలానికి జారీ చేసిన తొలి బాండ్లు ఇవే.
రిలయన్స్ 2021 సెప్టెంబర్ 30 నాటికి 'నెట్ జీరో డెట్' సంస్థగా అవతరించింది. కంపెనీ వద్ద నగదు రూ.2.59 లక్షల కోట్లుగా ఉండగా.. నికర అప్పులు రూ.2.55 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి:'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత