ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. ''భారత్‌లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. '2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను.' వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్ డీఎన్‌ఏలోనే ఉంది'' అని శుక్రవారం ఉదయం ముకేశ్ అంబానీ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53వేల కోట్లను సమీకరించింది. పెట్టుబడుల రూపంలోనూ జియో డిజిటల్ వ్యాపారంలోకి రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్ కారణంగా రిలయన్స్ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది.
కార్పొరేట్ చరిత్రలో అరుదైన ఘట్టం
రిలయన్స్‌కు రూ.1,61,035 కోట్ల నికర అప్పు ఉండేది. దీనిని 2021 మార్చి 31 నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనికోసం చాలా వేగంగా రైట్స్ ఇష్యూస్, వాటాల విక్రయం చేపట్టింది. ఈ డీల్స్‌తో రిలయన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త గుర్తింపు వచ్చింది. భారత కార్పొరేట్ రంగ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఒక రకంగా భారత కార్పొరేట్ శక్తిని ప్రపంచానికి తెలియజేసినట్టైంది. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌లు విధించిన సమయంలో ఈ డీల్స్ జరిగాయి.
అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే..
తొలుత రిలయన్స్ రైట్స్ ఇష్యూను జారీ చేసింది. ఇది భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్దది. ఇది 1.59 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నాన్ ఫైనాన్షియల్ సంస్థ జారీ చేసిన అతిపెద్ద రైట్స్ ఇష్యూ కూడా ఇదే.