ఆర్బీఐ నేతృత్వంలో ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) చివరి రోజు భేటీపై ఇటు మార్కెట్, అటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఆర్బీఐ రెపో రేట్లపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నాయి.
వడ్డీ రేట్లు మారతాయా? తటస్థంగా ఉంటాయా?
దేశీయంగా, అంతర్జాతీయంగా చూస్తే ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతోంది. ఆర్థిక గణాంకాలు చూస్తే.. 2018-19 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.8 శాతంతో ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వీటితో పాటు టోకు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యానికి లోబడే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వృద్ధికి ఊతమందించే దిశగానే ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం ఉండొచ్చని.. పలు నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నివేదికలు కీలక వడ్డీ రేట్ల కోత 25-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.
ఇప్పటికే వరుసగా రెండు ద్వైమాసిక ఎంపీసీ సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్ల కోత విధించింది ఆర్బీఐ.