సాధారణంగా 20 పదుల వయసులో చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగంలో చేరుతుంటారు. ఉద్యోగం రాగానే విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. పొదుపు, పెట్టుబడులపై శ్రద్ధ వహించరు. కొన్ని సంవత్సరాల తర్వాత పెట్టుబడి ప్రారంభిస్తారు. అయితే ఆ సమయంలో వీరు ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ.. అంతకంటే తక్కువ మొత్తంలో నెలవారీగా ముందు నుంచే పెట్టుబడి పెట్టిన వారితో పోల్చితే వచ్చే రిటర్న్‌ల్లో వ్యత్యాసం భారీగానే ఉంటుంది.
తక్కువ పెట్టుబడి అయినా రిటర్న్‌లు అధికమే
ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులకు 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చిందనుకోండి. అందులో ఒకరు... మొదటి నెల నుంచి రూ.2వేలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారనుకోండి. మరో వ్యక్తి మొదటి మూడు సంవత్సరాలు డబ్బును వృథాగా ఖర్చు చేసిన అనంతరం మొదటి వ్యక్తి కంటే ఎక్కువగా రూ.2500 పెట్టుబడి పెట్టారనుకుందాం. వీరిరువురూ 14 శాతం వార్షిక రాబడినిచ్చే సాధానంలో మదుపు చేశారనుకుంటే..
ఆ ఇద్దరు వ్యక్తులు.. తమకు 45 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నట్లయితే మొదటి వ్యక్తి రూ.54.55 లక్షలు.. రెండో వ్యక్తి రూ. 44.17 లక్షలు పొందుతారు. కేవలం మూడు సంవత్సరాల వ్యత్యాసంతోనే మొదటి వ్యక్తి 11.28 లక్షలు ఎక్కువగా సంపాదించారు. అంతేకాకుండా ఆ ఇద్దరు పెట్టుబడిని అలానే కొనసాగించినప్పటికీ 30 సంవత్సరాల్లో ఇద్దరి రిటర్న్‌ల్లో 20 లక్షలకు పైగా తేడా ఉంది. మ్యూచువల్ ఫండ్లలో సంవత్సరంలో వచ్చిన రాబడిని మళ్లీ పెట్టటం ద్వారా మొత్తంమీద ఆదాయంలో తేడాలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. దీన్నే కాంపౌండింగ్ ప్రభావం అని అంటారు.