తెలంగాణ

telangana

ETV Bharat / business

రాజకీయ ప్రకటనలు ఆపేది లేదు: ఫేస్​బుక్​ - business latest news

సామాజిక మాధ్యమాల దిగ్గజం.. ఫేస్​బుక్​ సీఈవో మార్క్​ జుకర్​బర్గ్​ రాజకీయ ప్రకటనలపై స్పందించారు. ఎప్పటిలాగానే రాజకీయ ప్రకటనలు తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రకటనలు మేము కొనసాగిస్తాం-ఫేస్​బుక్​

By

Published : Nov 1, 2019, 5:31 AM IST

Updated : Nov 1, 2019, 9:11 AM IST

రాజకీయ ప్రకటనలను తాము నిషేధించబోమని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలనేవి అభ్యర్థుల ‘వాణి’ని వినిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి ప్రకటనలను వేయాలా? వద్దా అని గతంలో ఆలోచించాం. ప్రజాస్వామ్యం ఉన్న చోట రాజకీయ నాయకులను గానీ వార్తలనుగానీ సెన్సార్‌ చేసే హక్కు ప్రైవేటు కంపెనీలకు ఉందని నేననుకోను. ఇక ముందు రాజకీయ ప్రకటనలను కొనసాగిస్తాం.’’ అని మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అంతేకాక రాజకీయ ప్రకటనలను గూగుల్‌, యూట్యూబ్‌ సహా కేబుల్‌ నెట్‌వర్క్‌లు, జాతీయ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని గుర్తు చేశారు. అయితే, ఆదాయం వస్తుందని రాజకీయ ప్రకటనలపై ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్‌ సహా దాని గ్రూపునకు సంబంధించిన యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్‌ వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో ఫేస్‌బుక్‌ 17.6 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సాధించింది. వినియోగదారుల డేటా దుర్వినియోగం చేసినందన్న ఆరోపణలు, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారం వ్యాప్తికి కారణమైందన్న ఆరోపణలు ఫేస్‌బుక్‌పై ఉన్న సంగతి తెలిసిందే.

భారత్‌లో గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌లో దాదాపు 1.21 లక్షల రాజకీయ ప్రకటనలు వచ్చినట్లుగా నివేదికలు స్పష్టం చేశాయి. ఫిబ్రవరి-మే నెలల మధ్య ఈ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం రూ.26.5 కోట్లకు పైబడి ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించకుండా సామాజిక మాధ్యమాలపై భారత ప్రభుత్వం గతంలోనే దృష్టి సారించింది.

ట్విట్టర్‌లో నిషేధం

మరోవైపు ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రకటనలు నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ జాక్‌ డోర్సే తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం నవంబరు 22 నుంచి అమల్లోకి రానుంది. రాజకీయ సందేశాలు వైరల్‌ అవుతూ ప్రజల వద్దకు చేరాలి కానీ, డబ్బు చెల్లించి వాటిని వారివద్దకు చేర్చకూడదని అభిప్రాయపడ్డారు. డబ్బు కోసం ఈ విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి : ట్విట్టర్​లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం

Last Updated : Nov 1, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details