టాటా సన్స్ ఛైర్మన్‌గా తనను తిరిగి నియమించాలన్న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం నిరుత్సాహానికి గురిచేసినట్లు సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. తన పదవీ కాలంలో తీసుకున్న చర్యలపై ఎటువంటి అనుమానాలు లేవని.. తన అంతరాత్మ స్పష్టంగానే ఉందని వ్యాఖ్యానించారు.
'సమాజంలోని ప్రతి వ్యక్తి తన చర్యలు, విశ్వాసాలకు కోర్టుల వంటి వ్యవస్థల్లో సముచిత స్థానం దక్కుతుందని చూస్తుంటారు. టాటా సన్స్‌లో మైనారిటీ వాటాదారుగా, వ్యక్తిగతంగా కోర్టు తీర్పు నన్ను బాగా నిరుత్సాహపరచింది. టాటా గ్రూప్ పాలనా దిశను నేను నేరుగా ప్రభావితం చేయలేను కానీ.. నేను లేవదీసిన అంశాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అది ఇతరుల్లో మార్పు తీసుకువస్తుంది. నా వరకు నేను ప్రశాంతంగా నిద్ర పోగలను' అని మిస్త్రీ పేర్కొన్నారు.
నేనెపుడూ అదృష్టవంతుడినే
'జీవితం ఎపుడూ మనవైపు ఉండదు. అయితే నేనెపుడూ అదృష్టవంతుడినే. నా కుటుంబం, స్నేహితులు, సహచరులు అప్పుడు, ఇపుడు మద్దతుగానే నిలిచారు. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న న్యాయ సలహాదార్లకు కృతజ్ఞతలు' అని మిస్త్రీ అన్నారు.
డైరెక్టర్లు మెచ్చుకున్నారు..
'గత నాలుగేళ్లుగా నా చర్యలపై ప్రతిస్పందించడానికి అవకాశం దక్కింది. నాయకత్వంలో మార్పు జరిగినపుడు బలమైన నిర్ణయాత్మక వ్యవస్థ, వ్యక్తికి మించిన పాలన ఉండాలని భావించాను. డైరెక్టర్లు ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా వ్యవహరించేలా దృష్టి సారించాను. టాటా సన్స్‌లో అందరు వాటాదార్ల విలువను రక్షించేలా ఒక నమూనా ఏర్పాటు చేయాలని భావించాను. నా పనితీరును పలు టాటా బోర్డుల్లోని 50 శాతం వరకు స్వతంత్ర డైరెక్టర్లు మెచ్చుకున్నారు కూడా. టాటా సన్స్‌లో పలు భిన్న పరిశ్రమలు, ప్రాంతాల నుంచి వచ్చిన అద్భుతమైన బృందంతో పనిచేసే అవకాశం దక్కింది. అందుకు నేను ఎపుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను' అని మిస్త్రీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సైరస్ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్‌కు ఊరట