డిజిటల్ పేమెంట్, ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించేలా శిక్షణ ఇచ్చేందుకుగానూ.. దేశవ్యాప్తంగా మొత్తం 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను (ఎఫ్ఎస్ఈ) నియమించుకోనున్నట్లు తెలిసింది.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతను అర్హత ఆధారంగా ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుందని.. ముఖ్యంగా కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశం కానుందని ఆయా వర్గాలు చెప్పాయి.
మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు.. అధికంగా మహిళా సిబ్బందిని నియమించుకునే యోచనలో పేటిఎం ఉందని తెలిసింది. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ఎఫ్ఎస్ఈ సిబ్బంది వేతనం, కమీషన్ల రూపంలో నెలకు రూ.35 వేలు అంతకన్నా ఎక్కువ మొత్తం సంపాదించే వీలుందని సమాచారం.