ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి భారీ స్పందన వస్తోంది. వీఆర్ఎస్ కోసం ఇప్పటివరకు 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం 2020 జనవరి 1 నుంచి అమలు కానున్నట్లు చెప్పారు.
బీఎస్ఎన్ఎల్లో ఉన్న మొత్తం లక్షా 50 మంది ఉద్యోగుల్లో.. లక్ష మంది వీఆర్ఎస్కు అర్హులని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది.
వీఆర్ఎస్ ఎందుకంటే..?
భారీ అప్పుల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.69,000 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం రూ.7,000 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వ అంచనా. ఈ పథకానికి మొత్తం 80,000 మంది దరఖాస్తు చేసుకుంటారని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.