దుకాణానికి వెళ్లే తీరికలేదు. వంట వండుకునే ఓపికలేదు. మనం వెళ్లిన చోట కోరుకున్నవి దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులు, కోరుకున్న ఆహార పదార్థాలు లభ్యమవుతుంటే.. వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనకివి సౌలభ్యంగా అనిపిస్తుండొచ్చు. ఈ సౌకర్యాల్ని అందిస్తున్న ఈ-కామర్స్ సైట్లు నమ్మకంగా వ్యాపారం చేస్తుండొచ్చు. కానీ మున్ముందు ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని, కేవలం కొన్ని పెద్దబ్రాండ్లే ఆన్‌లైన్ మార్కెట్‌ను, ధరల్ని శాసిస్తాయని భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల మన చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న ఉత్పత్తిదారులు, విక్రేతలంతా వెనుకబడిపోతారన్నది వారి అంచనా. రాబోయే దశాబ్దంలో బడా డిజిటల్ వేదికల గుత్తాధిపత్యాన్ని అడ్డుకునేదెలా? వాటిని మరింత ప్రజాస్వామ్యయుతం చేసే మార్గాలేవి? ‘ఈ-విపణిలో ఇరుక్కుపోకుండా’ ఉండాలంటే ఏం చేయాలి?
క్యాబ్ కావాలి..
పుస్తకం కొనాలి..
బిర్యానీ తెప్పించుకోవాలి..
అవసరం ఏదైనా చటుక్కున మొబైల్ తీస్తున్నాం..
ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తున్నాం..
డిజిటల్ వేదికల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టి.. వీటిని మరింతగా ప్రజాస్వామీకరించుకోవడం ఎలాగన్నదే ఈ దశాబ్ది ముందున్న సవాల్..
దీన్నెలా సాధిస్తాం?
ఇంటర్నెట్ యుగం.. డిజిటల్ విప్లవం తెచ్చిపెట్టిన అద్భుత సౌలభ్యం ఇది. ఈ అనూహ్య పురోగతితో అంతా బాగానే ఉందిగానీ సరిగ్గా ఇక్కడే.. మనకు తెలియకుండానే.. వ్యాపార అవకాశాలనూ, మన సదుపాయాలన్నింటినీ ‘బడా డిజిటల్ వేదికల’ చేతుల్లో పెట్టేస్తున్నాం! ఏదో క్యాబ్‌లను సమకూర్చే డిజిటల్ నిర్వాహకులు, వస్తువులను అమ్మిపెట్టే డిజిటల్ విక్రేతలే కాదు.. ఇప్పుడు మన దైనందిన జీవితాలకు సంబంధించిన చాలా పార్శ్వాలు ఈ ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్’ చుట్టూ అల్లుకుపోతున్నాయి. క్రమేపీ ఈ వేదికలు మరింతగా విస్తరిస్తూ.. వివిధ రంగాలపై గుత్తాధిపత్యాన్ని సాధించి... వచ్చే దశాబ్దంలో మనల్ని శాసించే స్థాయికి చేరుకోవటం తథ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రభంజనంలో పడి మన చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న ఉత్పత్తి దారులు, విక్రేతలంతా కొట్టుకుపోతున్నారు.
విపరిణామాలేమిటి?
డిజిటల్ వేదికల ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పటికే మనకు అనుభవంలోకి వస్తోంది.
- తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో క్యాబ్ సర్వీసులు.. పెరిగిన డిమాండును కారణంగా చూపుతూ భారీ ఛార్జీలు వసూలు చేశాయి.
- హైదరాబాద్‌లో కొన్ని ఆహార పంపిణీ పోర్టళ్లు.. కొన్ని ప్రత్యేక రోజుల్లో పదార్థాల ధరలను ఏకపక్షంగా తగ్గించేసి హోటళ్ల యజమానులను ఇబ్బంది పెట్టాయి.
- ఆర్థిక లావాదేవీల వేదికలు సైతం విలీనాలకు దిగుతుండటంతో.. సేవలకు మున్ముందు భారీగా ఛార్జీలు చెల్లించే పరిస్థితులు రావచ్చు.
- తయారీదారులు.. తాము ఉత్పత్తి చేసిన వస్తువు ధరను తాము నిర్ణయించుకోలేని దుస్థితి ఎదురవ్వచ్చు.
- తమకు లాభాలు వచ్చే వస్తువులే అధికంగా ఉత్పత్తి అయ్యేలా చూసి.. అంతిమంగా వినియోగదారుడికి ఎంపిక చేసుకునే హక్కును డిజిటల్ వేదికలు హరించొచ్చు.
భయాలు ఎందుకు?
మన దేశంలో మొబైల్ డేటా చౌక. అందువల్ల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లకు చేరుకుంది. 2030 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరనుంది. మన ‘ఈ-మార్కెట్’ కూడా విపరీతంగా పుంజుకుంటోంది. దేశంలో ఈ-కామర్స్, డిజిటల్ వేదికలు బలోపేతమవుతుండటానికి ఇదే కారణం. ప్రస్తుతం ఏడాదికి 5 వేల కోట్ల డాలర్లున్న ఆన్‌లైన్ వ్యాపారం 2026 నాటికి 20 వేల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా.
దేశంలో ఒక్కో ఆన్‌లైన్ యూజర్ సరాసరిన ఏడాదికి రూ.13 వేలు ఈ డిజిటల్ వేదికల్లో ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి ఇది రూ.27 వేలు దాటుతుందన్నది ఫిక్కీ లెక్క. ఈ లాభదాయక ఆన్‌లైన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే.. దేశంలో పెద్దపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ బలపడుతున్నాయి. వీటితో చిన్నచిన్న దుకాణాలు, విక్రేతలంతా పోటీపడే పరిస్థితే కనబడటం లేదు. వచ్చే దశాబ్దంలో కేవలం ఐదారు బడా డిజిటల్ వేదికలే మిగిలే ప్రమాదం కనిపిస్తోంది.
మనమేం చేయాలి?