దేశ రాజధాని దిల్లీలో ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో కిలో ఉల్లి గరిష్ఠంగా రూ.80 వరకు విక్రయమవుతోంది. కేవలం వారం వ్యవధిలో ధరలు 45 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే.. ప్రస్తుతం ఉల్లి ధరలు దాదాపు మూడింతలు పెరిగినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2018 నవంబర్లో కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.35 మధ్య ఉంది.
దేశంలో ఉల్లి లభ్యత పెంచేందుకు ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటి ప్రభుత్వ చర్యలున్నప్పటికీ.. ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం.
ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో.. ఉల్లి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా మార్కెట్లో ఉల్లి లభ్యత తగ్గి.. ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.