స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి వస్తున్నట్లు 'వన్ప్లస్' సంస్థ గత ఏడాది అధికారికంగా ప్రకటించింది. ఇటీవల 'వన్ప్లస్ టీవీ' పేరుతో లోగోను ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి ఎప్పుడొస్తాయనేది మాత్రం ప్రకటించలేదు వన్ప్లస్. టీవీలకు సంబంధించిన ఫీచర్లు, ధరల వంటి వివరాలేవీ వెల్లడించలేదు.
టెక్ సైట్లలో మాత్రం వన్ప్లస్ టీవీ ఫీచర్లు, విడుదల తేదీపై అంచనాలు హల్చల్ చేస్తున్నాయి. వీటి ప్రకారం సెప్టెంబర్ 26న వన్ప్లస్ స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
వన్ప్లస్ స్మార్ట్ టీవీలపై అంచనాలు ఇలా..
వన్ప్లస్... స్థాపించిన కొన్నేళ్లకే దిగ్గజ సంస్థగా ఎదిగింది. మార్కెట్లో వన్ప్లస్ స్మార్ట్ ఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకు ప్రధాన కారణం ఆ ఫోన్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ అయిన.. ఆక్సిజన్ ఓస్తో పని చేయడమే. ఇప్పుడు స్మార్ట్ టీవీల రంగంలోకి వన్ప్లస్ ఆడుగుపెడుతోంది. వన్ప్లస్ స్మార్ట్ ఫోన్ల లానే.. స్మార్ట్ టీవీలనూ ఆక్సిజన్ ఓస్తో అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.
అనుకున్నట్లుగానే వన్ప్లస్ టీవీ ఆక్సిజన్ ఓస్తో వస్తే.. 25 శాతం వరకు విజయం సాధించినట్లే అని టెక్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం విపణిలో ఉన్న ఆండ్రాయిడ్ టీవీలతో పోలిస్తే ఇవి ప్రత్యేకంగా ఉండనున్నాయి.