ప్రస్తుతం అన్ని సంస్థలు సాంకేతికతపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఇదే అదనుగా సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ఎప్పటికప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల్లో(ఎస్ఎంబీ) వినియోగిస్తున్న కంప్యూటర్లపై కీలక విషయాలు వెల్లడించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఈ సంస్థల్లోని పని ప్రదేశాల్లో ఉత్పాదకత క్షీణత, భద్రతలో సమస్యలు ఎదురైనట్లు గుర్తించింది.
అంతర్జాతీయ ఎస్ఎంబీ ఐటీ మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ- టెక్ఎస్లే భాగస్వామ్యంతో సర్వే చేపట్టింది మైక్రోసాఫ్ట్. ఆసియా పసిఫిక్ దేశాల్లోని సుమారు 2వేల ఎస్ఎంబీలపై సర్వే నిర్వహించింది.
నాలుగేళ్ల క్రితం వాటితో చిక్కులు..
కొత్త కంప్యూటర్లను వినియోగిస్తున్న సంస్థలతో పోలిస్తే.. నాలుగేళ్ల క్రితం కంప్యూటర్లు, పాత తరం ఆపరేటింగ్ వ్యవస్థల్ని వినియోగిస్తున్న ఎస్ఎంబీల ఉత్పాదకత క్షీణించినట్లు సర్వే వెల్లడించింది.
కొత్త పీసీలతో పోలిస్తే.. 4 రెట్లు ఎక్కువ సార్లు పాత వాటిని బాగు చేయించినట్లు తెలిపింది. దీని ఫలితంగా సుమారు 96 గంటల పని ఉత్పాదక సమయం నష్టపోయినట్లు వివరించింది సర్వే.