ఆన్లైన్ క్యాబ్ సేవల్లో తనదైన ముద్ర వేసిన ఓలా.. భవిష్యత్తు స్వచ్ఛ ఇంధన వాహన విపణిని ఒడిసిపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. మరోవైపు బెంగళూరుకు కొద్దిదూరంలో 'ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీ' పేరిట అతిపెద్ద తయారీ యూనిట్‌ను నిర్మిస్తోంది. 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు దిచక్ర వాహన తయరీ కేంద్రంగా చెబుతున్నారు. సెకనుకు రెండు ఈ-స్కూటర్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ విపణిని ఒడిసిపట్టాలని పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
మహిళలకు పెద్దపీట..
ఇంతటి గురుతర బాధ్యతను మహిళలకే అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. ఓలాఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తారని తెలిపారు. 10 వేల మందికి పైగా మహిళలు ఇందులో పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల నియమించుకున్న తొలి విడత మహిళా ఉద్యోగులను భవీష్ ఫ్యాక్టరీలోకి స్వాగతించారు.