ఓలా.. భారత్ మొబిలిటీ సేవల్లో ఓ సంచలనం. ఇప్పుడు మరో రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని ఏళ్లలో శిలాజ ఇంధనాల శకం ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్తంతా స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలదే కానుంది. ఈ మార్పుని 'ఓలా ఎలక్ట్రిక్' ఓ అవకాశంగా మలచుకునేందుకు సిద్ధమైంది. భారత్ కేంద్రంగా ప్రపంచ విద్యుత్తు వాహన విపణిపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా ఇప్పటికే బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్రపరిధిలోని ప్రాంతంలో 'ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ'కి పునాది రాయి వేసింది. కంపెనీ కార్యనిర్వణాధికారి(సీఈఓ) భవిష్ అగర్వాల్ వారాంతంలో ఇక్కడే గడుపుతూ 'మరో చరిత్ర'కు మార్గనిర్దేశం చేస్తున్నారు.
భారీ పెట్టుబడి..
బెంగళూరు నుంచి చెన్నై వైపు 150 కి.మీ దూరంలో తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో భారీ స్థాయిలో బుల్డోజర్లు, యంత్రాలు పనిచేస్తున్నాయి. దాదాపు 500 ఎకరాల్లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ కేంద్రానికి చిరునామా కానుంది. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి తయారీ ప్రారంభించాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి నిర్మాణం 2022, జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ భారీ ప్రాజెక్టు మొత్తంపై రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇక మొదటి దశ పూర్తయ్యే సరికి రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఏడాదికి కోటి యూనిట్లు..
విద్యుత్తు వాహన విపణి ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుగుతోంది. మరి దీన్ని చేజిక్కించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం భారీ స్థాయిలో విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేయడం. అందుకే జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసే దిశగా సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇక్కడ ఏడాదికి 20 లక్షల స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే సంవత్సరానికి కోటి యూనిట్లు ఉత్పత్తి కానున్నాయి. అంటే దాదాపు రెండు సెకన్లకు ఒక యూనిట్‌ను తయారు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 10 పూర్తిస్థాయి ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 3,000 రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈ ఫ్యాక్టరీలో 10 వేల మంది ఉపాధి కల్పించనున్నారు.