తెలంగాణ

telangana

ETV Bharat / business

లండన్​లో ఓలా క్యాబ్​ సేవలకు బ్రేకులు

బ్రిటన్​ రాజధాని లండన్​లో.. ఆన్​లైన్ క్యాబ్​ సేవల సంస్థ ఓలా కార్యకలాపాలకు బ్రేకులు పడ్డాయి. ప్రయాణికుల భద్రతకు సంబంధించి పలు లోపాలున్నాయన్న కారణంతో ట్రాన్స్​పోర్ట్ ఫర్ లండన్.. ఓలా లైసెన్స్​ను రద్దు చేసింది.

OLA BANNED IN LONDON
లండన్​లో ఓలా సేవలపై నిషేధం

By

Published : Oct 5, 2020, 6:24 PM IST

భారత్​కు చెందిన ప్రముఖ ఆన్​లైన్​ క్యాబ్​ సేవల సంస్థ ఓలాకు షాకిచ్చింది లండన్ రవాణా శాఖ. భద్రతా కారణాలతో లండన్​లో ఓలా క్యాబ్ సేవల​పై నిషేధం విధించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే లండన్​లో క్యాబ్ సేవలు ప్రారభించిన ఓలాకు ఇది పెద్ద షాకనే చెప్పాలి. అయితే ట్రాన్స్​పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్​ఎల్​) నిర్ణయంపై అప్పీలుకు వెళ్లేందుకు ఓలాకు 21 రోజుల సమయం ఉంది.

లైసెన్స్ నిషేధానికి కారణాలు..

ఓలా నిర్వహణ విధానంలో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించామని టీఎఫ్ఎల్​ డైరెక్టర్ హెలెన్ చాప్​మన్ తెలిపారు. ముఖ్యంగా చాలా క్యాబ్​లలో లైసెన్స్ లేని డ్రైవర్లు విధులు నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. ఇది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పెట్టడమేనని అందుకే.. లైసెన్స్ రద్దు చేసినట్లు వివరించారు.

ఒక వేళ దీనిపై ఓలా అప్పీలుకు వెళ్తే.. కార్యకలాపాలు సాగించేందుకు వీలుందని పేర్కొంది టీఎఫ్​ఎల్. అయితే ఈ సమయంలో ప్రయాణికుల భద్రతా విషయంలో రాజీ పడకుండా.. నిశితంగా సంస్థ కార్యకలాపాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

తాము గుర్తించిన లోపాలను కూడా.. సంస్థ గుర్తించలేకపోయిందని ఓలాను విమర్శించింది టీఎఫ్​ఎల్​.

ఓలా స్పందన..

టీఎఫ్​ఎల్​ నిర్ణయంపై అప్పీలుకు వెళ్తామని ఓలా బ్రిటన్ ఎండీ మార్క్ రొజెన్డాల్ తెలిపారు. లోపాలను సరిదిద్దేందుకు టీఎఫ్​ఎల్​తో కలిసి పని చేస్తామని వివరిచారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:గూగుల్​కు పోటీగా పేటీఎం యాప్​ స్టోర్

ABOUT THE AUTHOR

...view details