పండుగ సీజన్ నేపథ్యంలో వాహనాల అమ్మకాలు పెంచుకునే దిశగా ప్రణాళిక వేస్తున్నాయి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు. మాంద్యాన్ని ఎందుర్కొనేందుకు కార్పొరేట్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్దీపన సానుకూలతలను అందిపుచ్చుకోవాలని వాహన సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కార్పొరేట్ సుంకాల కోతతో.. వాహనాల అమ్మకాలు పెరుగుతాయా అన్న సందిగ్ధం ఆటోమొబైల్ సంస్థల్లో ఉంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు జీఎస్టీ తగ్గించాలని కేంద్రానికి విన్నవించాయి ఆటో మొబైల్ సంస్థలు. వాహన తయారీ సంస్థల డిమాండును కేంద్రం పక్కన పెట్టింది.
ప్రస్తుతం ఆఫర్లు ప్రకటించి.. వినియోగదారులను ఆకర్షించే వరుసలో మారుతీ సుజుకీ ముందుంది. ఈ సంస్థ ఇప్పటికే.. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ డీజిల్, సెలెరియో, బలెనో డీజిల్, ఇగ్నీస్, డిజైర్ డిజిల్, టూర్ ఎస్ డీజిల్‌లపై సహా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లపై రూ.5,000 ధర తగ్గించింది. తగ్గిన ధరలు తక్షణమే అందుబాటులోకి వస్తాయని.. ప్రస్తుతమున్న ఆఫర్లకు ఇది అదనమని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ఈ తగ్గింపుతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని మారుతీ ఆశాభావం వ్యక్తం చేసింది.