తెలంగాణ

telangana

ETV Bharat / business

'దివాలా స్మృతితో మారిన ఆలోచనలు-పెరిగిన రుణ వసూళ్లు' - insolvency code

దివాలా స్మృతి(ఐబీసీ)తో రుణ వసూళ్లు పెరిగాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియను క్రమబద్ధం చేసి వేగంగా కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టడానికి ఈ చట్టం దోహదం చేస్తోందని స్పష్టం చేశారు. సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టి భాగస్వాములందరికీ మేలు చేయడానికి ఈ స్మృతి ఉపయోగపడుతుందన్నారు.

nv ramana
ఎన్వీ రమణ

By

Published : Mar 7, 2020, 8:45 AM IST

Updated : Mar 7, 2020, 9:20 AM IST

రుణ గ్రహీత కేంద్ర బిందువుగా ఉండే న్యాయ ప్రక్రియను రుణదాత కేంద్రంగా దివాలా చట్టం మార్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి.రమణ చెప్పారు. "దివాలా చట్టాలు, వాటితో ముడిపడిన ఉత్తమ పద్ధతులు" అన్న అంశంపై శుక్రవారం దిల్లీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌, జాతీయ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ సభ్యులు దీనిలో పాల్గొన్నారు.

"ఇటీవలి కాలంలో భారతీయ బ్యాంకులు నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. అది క్రమంగా ఆర్థిక స్తబ్దతకు దారితీస్తోంది. కంపెనీలు, పరిశ్రమలు భారీమొత్తంలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించడానికి బదులు దివాలా తీసినట్లు ప్రకటించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దేశం క్రమంగా నిరర్ధక ఆస్తుల ఊబిలోకి జారిపోయింది. నిరర్ధక ఆస్తుల ప్రభావం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాలేదు. విదేశీ పెట్టుబడులపైనా తీవ్ర ప్రభావం చూపాయి. 2016లో దివాలా స్మృతి రూపొందించడానికి ఇదే దారితీసింది. రుణం చెల్లించకపోతే దివాలా ప్రక్రియ మొదలవుతుంది, దాని ఫలితంగా ఆస్తులను కోల్పోతామన్న భయాన్ని సృష్టించడం ద్వారా ఈ చట్టం రుణ గ్రహీతల్లో మంచి చెల్లింపు సంస్కృతి తీసుకొచ్చింది."

- జస్టిస్‌ ఎన్​.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

దివాలా స్మృతిలోని కొన్ని మాత్రమే ఇదివరకటి నిబంధనల్లా కనిపిస్తాయని.. దీనివల్ల ప్రతి కేసులో కొత్త ప్రశ్నలు ఉదయిస్తుంటాయన్నారు. కేసులను విచారించేటప్పుడు సభ్యులు వీటిని కేవలం ఆస్తి వివాదాలుగా కాకుండా వాణిజ్య కోణంలో పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇందులో తీర్పులు తప్పనిసరిగా గరిష్ఠ స్థాయిలో ఆస్తులు రాబట్టే విధంగా ఉండాలన్నారు.

"ఎన్‌సీఎల్‌టీ సభ్యుల పనితీరు అద్భుతంగా ఉంది. ట్రైబ్యునళ్ల న్యాయపరిధిని పెంచడంవల్ల సభ్యులపై పనిభారం నానాటికీ పెరిగిపోతోంది. అదే వేగంతో మౌలిక వసతుల కల్పననూ కొనసాగించాలి."

- జస్టిస్‌ ఎన్​.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ అత్యుత్తమ దివాలా విధానాలు అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. భారతీయ దివాలా న్యాయ విజ్ఞానాన్ని మిగతా దేశాలకు చేరువగా తీసుకెళ్లి దానికి ఒక ప్రపంచ దృక్పథాన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదిక ఓ వారధిలా ఉపయోగపడుతుందన్నారు.

Last Updated : Mar 7, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details