తెలంగాణ

telangana

ETV Bharat / business

'బ్యాంకు బీమా పెంపు ప్రతిపాదన మాతో లేదు' - తెలుగు వ్యాపార వార్తలు

బ్యాంకు దివాలా తీస్తే ఇచ్చే బీమా పెంపుపై తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని డిపాజిట్​ ఇన్సూరెన్స్​ అండ్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్ వెల్లడించింది. అయితే బీమా పెంపుపై కసరత్తు జరుగుతున్నట్లు గత నెల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన విషయం తెలిసిందే.

INSURANCE
బీమా పెంపు ప్రతిపాదన లేదు

By

Published : Dec 4, 2019, 7:30 AM IST

బ్యాంకు దివాలా తీసినప్పుడు డిపాజిటర్లకు లభించే రూ.లక్ష బీమా సదుపాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) వెల్లడించింది.

ఏదైన బ్యాంకు దివాలా తీస్తే ఆ బ్యాంకులోని డిపాజిటర్లకు డీఐసీజీసీ చట్టంలోని సెక్షన్‌ 16 (1) ప్రకారం.. డిపాజిట్​ మొత్తంతో సంబంధం లేకుండా.. అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకూ బీమా లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక ప్రాంత బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులు, మన దేశంలో పనిచేస్తున్న విదేశీ బ్యాంకు శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకులు, అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లోని డిపాజిటర్లకు బీమా సౌకర్యం వర్తిస్తుంది.

ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన డిపాజిట్లకు ఈ బీమా వర్తించదు. పొదుపు, కరెంటు ఖాతాలు, రికరింగ్‌ డిపాజిట్లు, అన్ని రకాల కాల పరమితి డిపాజిట్లకు ఈ బీమా రక్షణ ఉంటుంది.

అయితే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రూ.లక్ష డిపాజిట్‌ బీమాను పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని గతనెలలో తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. సహకార బ్యాంకుల నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు వెల్లడించారు. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారామె.

దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం డీఐసీజీసీని సమాచార హక్కు చట్టం ప్రకారం కోరినప్పుడు.. కార్పొరేషన్‌కు ఈ విషయంలో ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని’ తెలిపింది. బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తంతో నిమిత్తం లేకుండా.. రూ.లక్ష వరకే బీమా రక్షణ లభిస్తుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:'స్పామ్​ కాల్స్​'తో తలనొప్పి... ఐదో స్థానంలో భారత్​

ABOUT THE AUTHOR

...view details