తెలంగాణ

telangana

ETV Bharat / business

మరో అరుదైన ఘనత సాధించిన నీతా అంబానీ - బిజినెస్ వార్తలు తెలుగు

ప్రముఖ మహిళ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. న్యూయార్క్​లోని మెట్రోపాలిటన్​ మ్యూజియం ఆఫ్​ ఆర్ట్స్​ బోర్డులో గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారామె. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగానూ చరిత్రకెక్కారు.

నీతా అంబానీ

By

Published : Nov 13, 2019, 6:48 PM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌ పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డులో నీతా అంబానీ గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ మేరకు మ్యూజియం ఛైర్మన్‌ డేనియల్‌ బ్రాడ్‌స్కీ ప్రకటించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తి నీతానే కావడం విశేషం.

నీతా నిబద్ధత అసాధారణం..

ఈ సందర్భంగా డేనియల్‌ మాట్లాడుతూ.. ‘భారత సంస్కృతి సంప్రదాయాలు, కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో ఆమె చూపిస్తున్న నిబద్ధత అసాధారణమైనది. నీతా అంబానీ మద్దతుతో ప్రపంచం నలుమూలల ఉన్న కళల గురించి అధ్యయనం చేసే సామర్థ్యం మ్యూజియంకు లభించింది’ అని కొనియాడారు.

2016 నుంచే మ్యూజియానికి మద్దతు..

ప్రముఖ సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్‌కు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌. ఈ ఫౌండేషన్‌ 2016 నుంచి మెట్రోపాలిటన్‌ ఆర్ట్‌ మ్యూజియంకు మద్దతిస్తోంది. ఈ మ్యూజియం అంతర్జాతీయ మండలిలో సభ్యురాలిగా నీతా వ్యవహరిస్తున్నారు. మ్యూజియంలో ఏటా ఆమె ప్రత్యేక కార్యక్రమాలను నిర్వ‌హిస్తున్నారు.

నీతా అంబానీ సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి, కళలు, క్రీడాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీలో పనిచేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు సాధించిన ఆమె.. క్రీడారంగంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేసిన కృషికి 2017లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఖేల్‌ ప్రోత్సాహన్‌’ అవార్డు అందుకున్నారు.

ఇదీ చూడండి: ఇకపై ఫేస్​బుక్​లోనూ ఆన్​లైన్​ చెల్లింపులు!

ABOUT THE AUTHOR

...view details