దేశీయ విపణిలోకి నాట్కో ఫార్మా ఇకపై ఏటా 8 నుంచి 10 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టనుంది. గురువారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ వీసీ నన్నపనేని ఈ విషయం వెల్లడించారు. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ విపణికి అధిక విలువ గల ఔషధాలు విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు 2019-20 సంస్థ ఆదాయాల్లో 8.65 శాతం నిధులను వెచ్చించినట్లు చెప్పారు. మూలధన వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.349 కోట్లు కాగా, ఇందులో విశాఖపట్నం యూనిట్ విస్తరణకు అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఎదుర్కొన్న సవాళ్లు ఇవీ..
కొవిడ్-19 వల్ల కేన్సర్ రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వెళ్లలేకపోయారని, ఫలితంగా కేన్సర్ ఔషధాల అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. ఈ ఔషధాల ధరలూ తగ్గాయని, హెపటైటిస్-సి ఔషధ అమ్మకాలు తగ్గాయని వివరించారు.
అమెరికా అమ్మకాలు తగ్గలేదు..
అమెరికాలో ధరల ఒత్తిడి, పోటీ ఉన్నప్పటికీ తమ ఔషధ అమ్మకాలు తగ్గలేదని వీసీ నన్నపనేని వివరించారు.