Mutual funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను తీసుకోవడానికి ఇప్పుడు ఒక్క క్లిక్ చాలు. ఒకప్పుడు ఇదో పెద్ద ప్రక్రియ. సంస్థ కార్యాలయానికి వెళ్లి, దరఖాస్తు ఫారం నింపాల్సి వచ్చేది. మారిన సాంకేతికతతో ప్రక్రియ మనకు సౌకర్యంగానే ఉన్నా.. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నామా? అవసరం లేకున్నా తీసేస్తున్నామా? ఇవి తెలుసుకోండి.
లక్ష్యాలకు చేరువగా: ప్రతి పెట్టుబడికీ ఒక గమ్యం ఉండాలి. మీరు ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించినప్పుడే దీన్ని నిర్ణయించుకోవాలి. దానిని చేరుకునేంత వరకూ పెట్టుబడుల్లో ఒక్క రూపాయినీ వెనక్కి తీసుకోవద్దు. కొన్నిసార్లు మీరు అనుకున్న వ్యవధిలోపే అవసరానికి కావాల్సినంత మొత్తం జమ కావచ్చు. ఇలాంటప్పుడు మీరు పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు.. గమ్యం మరో రెండుమూడేళ్లు ఉందనగా.. ఈక్విటీలాంటి నష్టభయం ఉన్న పథకాల నుంచి డెట్ పథకాల్లోకి పెట్టుబడులను మళ్లించాలి. దీనివల్ల నష్టభయం పరిమితం అవుతుంది. దీనికోసం క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) వినియోగించుకోవాలి. సిప్‌లాగే ఇదీ మీ పెట్టుబడులను క్రమంగా ఈక్విటీల నుంచి డెట్‌కు మళ్లించేందుకు ఉపయోగపడుతుంది.
నిర్ణయాలు మారినప్పుడు..:కాలానుగుణంగా కొన్నిసార్లు లక్ష్యాలు, అవసరాలు మారుతుంటాయి. స్వల్పకాలిక అవసరం అనుకొన్నది.. దీర్ఘకాలానికి మారొచ్చు. ఇలాంటప్పుడు దానికి ముడిపెట్టిన పెట్టుబడినీ అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. అంతేకానీ, అవసరం మారింది కదా అని పెట్టుబడిని వెనక్కి తీసుకోవద్దు. ఈ లక్ష్యాల ప్రకారం మీ పెట్టుబడుల కేటాయింపులూ మారాలి.