తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2020, 2:57 PM IST

ETV Bharat / business

ఈ-కామర్స్​ విస్తరణకు రిలయన్స్ దూకుడు

ఇటీవల భారీగా పెట్టుబడులను ఆకర్షించిన రిలయన్స్ ఇండస్ట్రీస్​.. ఇప్పుడు ఈ-కామర్స్ వ్యాపారాల విస్తరణలో దూకుడు పెంచింది. ఇందుకోసం మార్కెట్లో ఆన్​లైన్​ రిటైల్ సేవలందిస్తున్న సంస్థల కొనుగోలుకు చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 'నెట్​మెడ్స్​' అనే ఆన్​లైన్ ఫార్మా సంస్థను రూ.620 కోట్లతో స్వాధీనం చేసుకుంది. దీనితో ఇతర రంగాల్లోని సంస్థల కొనుగోలుపై అంచనాలు భారీగా పెరిగాయి.

Reliance Retails biz expansion
రిటైల్ వ్యాపారాల విస్తరణలో రిలయన్స్ దూకుడు

ఆడుగు పెట్టిన ప్రతి రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తనదైన ముద్ర వేస్తుంది. టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు అదే దూకుడుతో రిటైల్​ వ్యాపారాల విస్తరణపై రిలయన్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఆన్​లైన్​ రిటైల్ రంగాన్ని ఏలుతున్న అమెజాన్, వాల్​మార్ట్​కు పోటీగా.. ఈ-కామర్స్‌ రంగంలోకి జియో మార్ట్ పేరుతో రిలయన్స్‌ కూడా సేవలు ప్రారంభించింది. తాజాగా దీనిని మరింత విస్తరింపజేయాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం స్థానికంగా సేవలందిస్తున్న పలు రకాల ఈ-కామర్స్‌ సంస్థల కొనుగోలుకు సంబంధించి వాటితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

దీనితో జియో మార్ట్‌లో మరిన్ని రకాల సేవలు అందుబాటులోకి తేవాలని రిలయన్స్​ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఫర్నిచర్‌, లోదుస్తులు, మందులు, పాలు సరఫరా చేసే పలు సంస్థలతో రిలయన్స్‌ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

తాజాగా మందుల (ఆన్​లైన్ ఫార్మా) విభాగంలో సేవలందిస్తున్న 'నెట్​మెడ్స్​' సంస్థను రూ.620 కోట్లతో కొనుగోలు చేసింది రిలయన్స్. మంగళవారం జరిగిన ఈ లావాదేవీపై సంస్థ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనితో ఇతర సంస్థలతో చర్చలపై అంచనాలు మరింత పెరిగాయి.

మరిన్ని సంస్థల స్వాధీనం..

గతంలో జియోలో వాటాల విక్రయం తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌లోకి పెట్టుబడులను ఆహ్వానించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు ముకేశ్ అంబానీ. ఈ-కామర్స్‌ రంగంలో రిలయన్స్‌ విస్తరణను ప్రారంభిస్తే రాబోయే ఐదేళ్లలో అతి పెద్ద ఆన్​లైన్​ రిటైల్‌ సంస్థగా అవతరించే అవకాశం ఉందని పలువురు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన బొమ్మల సంస్థ హామ్‌లేస్‌, మ్యూజిక్‌ యాప్‌ సావన్‌, లాజిస్టిక్‌ సేవల సంస్థ గ్రబ్‌ సర్వీసెస్‌, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ హాప్టిక్‌లను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు కూడా రిలయన్స్ ఆసక్తి కనబర్చినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

ఆన్​లైన్​కు పెరిగిన డిమాండ్​..

కరోనా ప్రభావంతో ఈ-కామర్స్‌ సేవలకు డిమాండ్ పెరిగింది. దీనితో బయటకు వెళ్లి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి కనబరచడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జియో మార్ట్‌ను విస్తరించి దాని ద్వారా మరిన్ని సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్‌ సేవలను అందిస్తోంది.

ఇదీ చూడండి:సంక్షోభ సమయమే పరిశ్రమల ఏర్పాటుకు తరుణోపాయం!

ABOUT THE AUTHOR

...view details