Changing Jobs: అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినా.. ఉద్యోగావకాశాలు సానుకూలంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగులు ఈ ఏడాది ఉద్యోగం మారాలని భావిస్తున్నారట. ప్రముఖ ఆన్‌లైన్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ పోర్టల్ 'లింక్డ్‌ఇన్' సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన వేలమంది ఉద్యోగులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త ఉద్యోగాలు అన్వేషించే వారిలో ఫ్రెషర్స్ లేదా ఒక ఏడాది అనుభవం ఉన్నవారే 94 శాతం ఉన్నారని నివేదిక చెబుతోంది. ఇక జెడ్ జనరేషన్ (1990-2000 సంవత్సరాల మధ్య పుట్టిన వ్యక్తులు) ఉద్యోగుల్లో 87 శాతం మంది ఉద్యోగం మారాలని యోచిస్తున్నారు.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారడానికి గల కారణాల విషయానికొస్తే.. వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేపోతున్నామని 23 శాతం మంది, వేతనం సరిపోవట్లేదని 28 శాతం మంది, మెరుగైన కెరీర్ కోసం ఉద్యోగం మారుతున్నామని 23 శాతం మంది వెల్లడించారు. కొత్త ఉద్యోగాల అన్వేషణలో అనుకూల పనివేళలకే మొదటి ప్రాధాన్యమిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.
Linkedin Survey: భవిష్యత్తులో ఉద్యోగ లభ్యతపై చాలా మంది ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. 86 శాతం మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌పై, ఉద్యోగ పొందే సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నారు. కానీ, 33 శాతం మంది కరోనా మహమ్మారి తమలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వాపోయారు.