మైక్రోసాఫ్ట్ నుంచి రెండు తెరల మడత స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు సంస్థ ఉన్నతాధికారులు. సర్ఫేస్ డ్యుయో, సర్ఫేస్ నియో పేరుతో వచ్చే ఏడాది చివరికి ఇవి అందుబాటులోకి వస్తాయని అమెరికా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. మడతపెట్టి ఉన్నపుడు వీటి పరిమాణం 5.6 అంగుళాలు. తెరిచినప్పుడు 8.3 అంగుళాలకు పెరుగుతుంది.
ఈ రెండు తెరల ఫోన్లో ఒకేసారి రెండు యాప్‌లను ఓపెన్ చేయవచ్చు. లేదా ఒకే యాప్‌నూ వాడవచ్చు. ఆ సమయంలో మరో తెర కీబోర్డ్‌గా పనిచేస్తుంది.
ఇటీవలే గేలాక్సీ సిరీస్‌తో మడత ఫోన్లను విడుదల చేసింది మొబైల్ దిగ్గజ సంస్థ శాంసంగ్. ఇప్పుడు వీటికి పోటీగా రెండు తెరల మడత ఫోన్‌తో రాబోతోంది మైక్రోసాప్ట్.
గతంలో మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వినియోగించారు. కొత్తగా రూపొందిస్తున్న రెండు తెరల ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.
వినియోగదారులకు అత్యాధునిక సదుపాయలతో అత్యున్నత సాంకేతిక విలువలు గల డివైస్‌లను అందుబాటులోకి తీసుకురావడమే సంస్థ లక్ష్యమని తెలిపారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.