సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్‌కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన'వోకల్ ఫర్ లోకల్'నినాదానికి మద్దతు పెరుగుతోంది. వీటిని దేశీయ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తున్నారు. దాన్ని అనుకూలంగా మార్చుకుని తిరిగి సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోమ్యాక్స్.
అభిమానులు ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు అడగగా.. వాటికి మైక్రోమ్యాక్స్ ఇచ్చిన సమాధానాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
అభిమానులతో మైక్రోమ్యాక్స్ సంభాషణ..
"చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త మోడళ్లను తీసుకురండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు చేయగలరు. అందుకు ఇదే సరైన సమయం. భారతీయులమంతా మీతో ఉంటూ.. మీకు పూర్తి మద్దతు ఇస్తాం.." ఓ అభిమాని ట్వీట్ చేశారు.
అందుకు మైక్రోమ్యాక్స్ స్పందిస్తూ.. "'వోకల్ ఫర్ లోకల్'కు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతర్గతంగా కొత్త ఉత్పత్తుల కోసం మేము తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలోనే సరికొత్త ఉత్పత్తులతో మీ ముందుకు వస్తాం. " అని ట్వీట్ చేసింది.
మరో అభిమాని.. "మైక్రోమ్యాక్స్ మీ నుంచి ఏదైనా మిడ్‌రేంజ్ ఫోన్‌ను అశించవచ్చా?" అని ట్విట్ చేశాడు.