మీకు ఇష్టమైన వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? ఏదైనా డిస్కౌంట్ లేదా ఆఫర్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? మీ లాంటివారి కోసమే వాహన తయారీ సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేలు మొదలుకుని రూ.లక్షల్లో రాయితీలు ఇస్తున్నాయి.
డిస్కౌంట్లు ఎందుకు?
వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ (బీఎస్-6) ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి 31 తర్వత బీఎస్4 వాహనాలను విక్రయించడం గానీ, రిజిస్ట్రేషన్ చేయడం గానీ నిషేధం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బీఎస్4 యూనిట్లను వీలైనన్ని ఎక్కువగా విక్రయించాలని వాహన తయారీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్4 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.
గతంలోనూ బీఎస్4 నిబంధనలు తప్పని సరి చేసినప్పుడు.. బీఎస్3 వాహనాలను ఇలానే భారీ రాయితీలకు విక్రయించాయి వాహన సంస్థలు.
ఈ సారి డిస్కౌంట్లతో పాటు లాయల్టీ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, తక్కువ కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్లు ఉన్నాయి.
ఆఫర్లలో కొనేముందు గుర్తుంచుకోవాల్సి విషయాలు..
వివిధ కంపెనీలు రూ.10వేల నుంచి డిస్కౌంట్లను ఇస్తున్నాయి. అత్యధికంగా జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఎక్స్‌జే ప్రీమియం సెడాన్ పైన రూ.31.40 లక్షల డిస్కౌంట్‌ను అందిస్తోంది.
స్టాక్ ఉన్నంత వరకు వర్తించే ఈ ఆఫర్లు ఒక్కో డీలర్ వద్ద ఒక్కో విధంగా ఉండొచ్చని, తదనుగుణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి గడువున్న దృష్ట్యా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.