దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా&మహీంద్రా విద్యుత్‌తో నడిచే ఈకేయూవీ100 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2020లో మహీంద్రా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈకేయూవీ 100 ప్రారంభ ధరను రూ.8.25 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న విద్యుత్ కార్లతో పోలిస్తే ఈ కారు సరసమైన ధరకు లభించనుంది. చూడటానికి పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే సంప్రదాయ కేయూవీ 100 వాహనాన్ని పోలి ఉన్నప్పటికీ.. ఈ ఎలక్ట్రిక్ కారులో పలు కీలక మార్పులు చేసినట్లు మహీంద్రా తెలిపింది. హెడ్‌ల్యాంప్, గ్రిల్, వెనక లైట్లుతో పాటు కారు ఇంటీరియర్‌లోనూ మార్పులు చేశారు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లోకేషన్ ట్రాకింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
మహీంద్రా ఈకేయూవీ100లో 40కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది 53బీహెచ్‌పీ శక్తిని, 120ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కారు ముందు చక్రాలకు శక్తిని అందిస్తుంది. అలానే ఈకేయూవీ 100లో 15.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది.
కేవలం 60 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ అవుతుంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది.