అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సినప్పుడు రుణాలు ఇచ్చేందుకు చాలా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ కోవలోకి అంకుర సంస్థలు ప్రవేశించాయి. నిజానికి ఇవి వైద్య చికిత్సకోసం ఇచ్చే రుణాలే అయినప్పటికీ.. హామీ లేని వ్యక్తిగత రుణాల కిందికే వస్తాయి. వడ్డీ 12 శాతం మొదలుకుని రుణాన్ని, రుణ గ్రహీత వయస్సును బట్టి 30 శాతం వరకు ఉంటుంది.
ఈ రుణాలకు అర్హులు ఎవరంటే..
- మెడికల్ లోన్స్ దరఖాస్తు చేసుకునేందుకు 23-58 ఏళ్ల వారిని అర్హులుగా పరిగణిస్తున్నాయి రుణసంస్థలు.
- రుణ గ్రహీతలకు నెలకు కనీసం రూ.20 వేల జీతం ఉండాలి.
- వడ్డీ రేటు మీరు తీసుకున్న రుణ మొత్తం, వ్యవధి, మీ వయసుపై ఆధారపడి ఉంటుంది.
ఎలాంటి ధ్రువపత్రాలు అవసరం..
మెడికల్ రుణాలు ఇచ్చే సంస్థలు చాలా వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. అలాంటి అవకాశం లేకపోతే దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకుని అందులో మీ పూర్తి వివరాలు నింపాలి.
పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సులాంటివి మీ వ్యక్తిగత, చిరునామా గుర్తింపు కోసం అవసరం అవుతాయి.
ఆరునెలల లావాదేవీల వివరాలను (బ్యాంకు లావాదేవీలు) తెలపాలి. ఆన్‌లైన్‌లో వెంటనే ఈ వివరాలు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్‌లైన్ ఖాతా లేకుంటే మీ బ్యాంకు శాఖకు వెళ్లి, ఆరు నెలల లావాదేవీల వివరాలను తీసుకోవాలి.
ఆదాయ వివరాలను ధ్రువీకరించడానికి మీ ఫారం-16 ఉపయోగపడుతుంది. ఇది లేనప్పుడు మీ యాజమాన్యం ఇచ్చే ఆదాయ ధ్రువీకరణతోపాటు, గత ఆరు నెలల వేతన వివరాలు జత చేయాలి.