తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: యాప్​లో క్లిక్​ కొట్టు- అప్పు పట్టు! - యాప్​ ద్వారా రుణాలు

అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాలి. అప్పుడు కూడా లోన్ వస్తుందనే నమ్మకంలేదు. ఇప్పుడు కాలం మారింది. బ్యాంకులకు వెళ్లకుండానే, కనీసం భౌతికంగా ఎలాంటి పత్రాలు వాడకుండానే రుణాలు ఇస్తున్నాయి కొన్ని యాప్​లు. ఏంటా యాప్​లు? వాటి ద్వారా రుణం పొందడం ఎలా?

క్లిక్​ కొట్టు- అప్పు పట్టు!

By

Published : Jun 16, 2019, 5:55 AM IST

వ్యక్తిగత అవసరాలకు వేగంగా, అదికూడా మీ ఫోన్ నుంచే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని మొబైల్ యాప్​లు. వాటి ద్వారా రుణాలు పొందడం ఎలాగో తెలుసుకోండి ఇప్పుడే.

ఇండియాబుల్స్ ధనీ:

తక్షణ వ్యక్తిగత రుణాలు అందించే యాప్​లలో ఉత్తమ యాప్​గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రుణాల మొత్తం కూడా అధికంగా ఉండటమే ఇందుకు కారణం. గ‌రిష్ఠంగా రూ.15 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాన్ని ఇస్తుంది ఈ సంస్థ. వార్షికంగా 11.99 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ రుస‌ుములు 5 శాతం ఉంటాయి.

రుణం పొందేందుకు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెరిఫికేష‌న్ కోసం... మీ పాన్‌, చిరునామా వివ‌రాల‌ు ఇవ్వాల్సి ఉంటుంది. వాటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో రుణం మొత్తం కొన్ని నిమిషాల‌లోనే జ‌మ అవుతుంది.

ఎనీ టైమ్‌ లోన్‌:

ఉద్యోగులు, స్వ‌యం ఉపాధి పొందే వ్య‌క్తుల‌కు రుణాల‌ు అందిస్తుంది... 'ఎనీ టైమ్​ లోన్​'. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు హామీ లేకుండా రుణాల‌ు ఇస్తుంది.
'ఎనీ టైమ్ లోన్'​​ ద్వారా గ‌రిష్ఠంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొందొచ్చు. వార్షిక వ‌డ్డీ రేటు 18-54 శాతం వ‌ర‌కు ఉంటుంది.

మ‌నీ ట్యాప్‌:

రుణాలు పొందేందుకు ఇది కూడా ఒక ప్రత్యేకమైన యాప్​. ఎందుకంటే ఈ యాప్ ద్వారా వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ తీసుకుంటుంది ఈ సంస్థ.

మ‌నీట్యాప్‌, దేశంలోని ప్ర‌ముఖ ఎన్‌బీఎఫ్‌సీల‌ భాగ‌స్వామ్యంతో రుణాలు ఇస్తుంది. ఈ యాప్ ద్వారా గ‌రిష్ఠంగా రూ.5 ల‌క్ష‌లు రుణం పొంద‌వ‌చ్చు. 2 నుంచి 36 నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి వ‌డ్డీ రేటు వార్షికంగా 13 నుంచి 24.3 శాతం ఉంటుంది.

మ‌నీ వ్యూ:

ఇది కూడా వేగంగా రుణాలు అందించే యాప్​. ఈ యాప్​ ద్వారా గ‌రిష్ఠంగా రూ.5 ల‌క్ష‌ల వ‌రకు రుణం పొందొచ్చు. వార్షిక వ‌డ్డీరేటు 16 నుంచి 24 శాతం వ‌ర‌కు ఉంటుంది. ప్రాసెసింగ్ రుసుములు 2.5 నుంచి 4 శాతం వ‌ర‌కు ఉంటాయి.

ఎర్లీ సాల‌రీ:

గత రుణ చరిత్ర అవసరం లేకుండానే ఈ యాప్ అప్పులు ఇస్తుంది. ఈ యాప్‌ను ఉప‌యోగించి రూ.15 వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వరకు రుణాల‌ు పొంద‌వ‌చ్చు.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బ‌జార్​లో జరిపే కొనుగోళ్లకు ఈ యాప్​ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. రుణం మొత్తంపై నెల‌కు 2 నుంచి 2.5 శాతం వ‌డ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద 2 శాతం తీసుకుంటుంది ఈ సంస్థ. అయితే ఈ యాప్​ దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మాత్రమే రుణ సేవలు అందిస్తోంది.

క్యాష్ ఈ:

నైపుణ్య‌ం, సంపాద‌నా సామ‌ర్థ్యం, సామాజిక ప్రొఫైల్ ఆధారంగా స్వ‌ల్ప కాలిక వ్య‌క్తిగ‌త రుణాల‌ను త్వ‌రితగ‌తిన అందిస్తుంది. ఇది పూర్తిగా స్వ‌యం చాల‌కంగా ప‌నిచేస్తుంది. ఇందులో వ్య‌క్తిగ‌త రుణం పొందేందుకు డాక్యుమెంట్‌ల‌ను కాగిత రూపంలో అందించ‌న‌వ‌స‌రం లేదు. రూ. 5 వేల నుంచి గ‌రిష్ఠంగా రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ు ఇస్తుంది. నెల‌వారీ వ‌డ్డీరేటు 1.5శాతం.

ఫ్లెక్స్‌ సాల‌రీ:

సాల‌రీ అడ్వాన్స్‌, త‌క్ష‌ణ రుణాల‌ను అందించే యాప్ 'ఫ్లెక్స్ సాల‌రీ'. ఈ యాప్ ద్వారా ఉద్యోగ‌ులు గ‌రిష్ఠంగా రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వచ్చు. సోషల్​ మీడియా ఖాతా ద్వారా లాగిన్ అయ్యి... బేసిక్ వివ‌రాలు, పాన్ కార్డు వివ‌రాలు పూర్తి చేసిన అనంత‌రం మీ ద‌ర‌ఖాస్తును రుణం ఆమోదానికి పంపుతారు. ఆమోదం పొందిన అనంత‌రం రుణం మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జ‌మ చేస్తారు.

పే సెన్స్‌:

ఐఐఎఫ్ఎల్, ఫుల్ల‌ర్‌ట‌న్​ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఈ సంస్థ రుణాలు అందిస్తుంది. ఈ యాప్ ద్వారా గ‌రిష్ఠంగా రూ.2 ల‌క్ష‌ల రుణం లభిస్తుంది. వార్షికంగా 16.8 శాతం ప్రారంభ వ‌డ్డీ ఉంటుంది. రిస్క్‌ ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యిస్తారు. రుణం పొందేందుకు బ్యాంకు స్టేట్‌మెంటుతో పాటు కేవైసీ ప‌త్రాల‌ను సాఫ్ట్ కాపీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.

క్రీడీ:

తక్కువ సమయంలో వ్యక్తిగత రుణాలు ఇచ్చే సంస్థగా క్రీడీకి పేరుంది. దీని ద్వారా గ‌రిష్ఠంగా రూ. ల‌క్ష వ‌ర‌కు రుణం పొందొచ్చు. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయిలో మాత్రమే ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెల‌వారీ వ‌డ్డీ రేటు 1 శాతం నుంచి 1.5 శాతం వ‌ర‌కు ఉంటుంది.

పేమీ ఇండియా:

పేమీ ఇండియా ఒక వినూత్న ఫిన్‌టెక్ యాప్‌. ఇది కార్పొరేట్ ఉద్యోగుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌ు అందిస్తుంది. గ‌రిష్ఠ రుణం రూ.ల‌క్ష, నెల‌వారీ వ‌డ్డీ రేటు 2 నుంచి 6 శాతం వ‌ర‌కు ఉంటుంది.

ఇదీ చూడండి: ట్రెండ్ గురూ: స్మార్ట్​ టీవీలకే సామాన్యుల జై

ABOUT THE AUTHOR

...view details