కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలొన్నాయి. భారత్‌తో పాటు చాలా దేశాలు లాక్డౌన్ విధించిన కారణంగా విమానయానం నుంచి అన్ని రవాణా సదుపాయాలు.. అత్యవసరం కాని అన్ని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీని వల్ల ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.
చెదరని ధైర్యం..
ఇలాంటి సంక్షోభంలోనూ దేశంలోని ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు, పెట్టుబడిదారుల మనోధైర్యం చెక్కుచెదరలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌లోనూ అంకుర సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య.. పెట్టుబడి, నూతన వ్యాపారాలపై చర్చలు జరిగాయి. లాక్డౌన్ సమయంలో చాలా మంది ఔత్సాహికులు నూతన వ్యాపారాలకు ప్రతిపాదనలు పంపగా.. వాటికి మూలధనం సమకూర్చేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు.
దరఖాస్తులు పెరిగాయ్..
లాక్డౌన్లో పెట్టుబడుల కోసం స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు పెరిగాయని ముంబయికి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ యూనికార్న్ ఇండియా వ్యవస్థాపకుడు అనిల్ జోషి వెల్లడించారు. ఈ సమయంలో తమకు సగటున రోజుకు 8-10 దరఖాస్తులు వచ్చినట్లు 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు.