లాక్డౌన్లో దుకాణాలన్నీ బంద్. హెయిర్ కట్ చేసుకోవడం ఎలానో ఎవరికీ తెలియదు. ప్రయోగాలు ఏమైనా చేద్దామంటే తగిన సరంజామా లేదు. లాక్డౌన్ ముగిసినా, ఆంక్షలు సడలించినా... గతంలోలా ధైర్యంగా సెలూన్‌కు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు 'ట్రిమ్మర్'పై పడింది. సాధ్యమైనంత త్వరగా ఒకటి కొనుక్కోవాలని చూస్తున్నారు అంతా. సరసమైన ధరకు మంచి ట్రిమ్మర్లు ఏమున్నాయోనని ఈ-కామర్స్ సైట్లలో తెగ వెతికేస్తున్నారు.
15 రోజులుగా టాప్-10లోనే
వినియోగదారులు అత్యధికంగా శోధించిన టాప్-10 జాబితాలో గత 15 రోజులుగా.. ట్రిమ్మర్లు ఉన్నట్లు తెలిపింది ఫ్లిప్‌కార్ట్. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వీటి కోసం వెతికిన వారి సంఖ్య 4.5 రెట్లు పెరిగిందని వెల్లడించింది. గ్యాస్ స్టౌవ్‌ల కోసం వెతుకుతున్న వారి సంఖ్య రెండింతలు అయినట్లు తెలిపింది. అయితే.. ఫ్యాన్లు, ఏసీల పరిస్థితి ఏటా వేసవిలో ఎలా ఉంటుందో అదే రీతిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.
కొన్ని రాష్ట్రాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అత్యవసర, ఇతర ఉత్పత్తుల అమ్మకాలకు ఈ-కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో.. ల్యాప్టాప్స్, మొబైల్స్, ఏసీ, కూలర్స్, టీ-షర్ట్స్ వంటి వాటి కోసం ఎక్కువగా వెతకటాన్ని గుర్తించాం. దేశవ్యాప్తంగా లక్షల మంది అమ్మకందారులు, ఎంఎస్ఎఈలతో కలిసి మా సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుత సమయంలో వినియోగదారులకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. సురక్షితమైన, శానిటైజ్ చేసిన సరఫరా చైన్‌తో వినియోగదారుల ఇంటికి ఉత్పత్తులను చేరవేసేందుకు నిరంతరం సేవలందిస్తుంది ఫ్లిప్‌కార్ట్. ప్రభుత్వ, స్థానిక అధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలు కొనసాగుతాయి.
– అనిల్ గోటేటి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫ్లిప్‌కార్ట్
ఆన్‌లైన్‌కే ప్రజలు ఓటు..
కరోనా భయాలతో ప్రజలు బయటకు పెద్దగా వచ్చే పరిస్థితులు లేనందున.. ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం చిన్న దుకాణాలను అనుమతించి.. మాల్స్, పెద్ద మార్కెట్లకు మూసి ఉంచితే.. హోండెలివరీ కోసం ప్రజలు ఆన్లైన్ స్టోర్స్పైనే ఆధారపడతారని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ… గిడ్డంగులు, లాజిస్టిక్స్‌లో సిబ్బంది కొరత కారణంగా డెలివరీలో జాప్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.