పండుగ సీజన్ మొదలైంది. ఈ సమయాల్లో అందరూ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సహజం. ఈ సమయంలో కావాల్సినంత డబ్బు చేతిలో లేకున్నా.. రుణాలు తీసుకుందాం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి తనఖా లేకుండానే వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. ఇలాంటి రుణాల విషయాల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు.. తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తాయి. మరి ఆ పొరపాట్లేంటి? వాటిని అధిగమించడం ఎలానో తెలుసుకోండి.
రుణాలను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు.. మేలు చేసే రుణాలు, భారం పెంచే రుణాలు.
ఇల్లు, స్థిరాస్తులు కొనడం కోసం చేసే రుణాలు మేలు చేసేవిగా భావించవచ్చు. ఇక అవసరమున్నా లేకున్నా తీసుకునే రుణాలే చివరకు ఇబ్బందుల్లో పడేస్తాయి.
ముఖ్యంగా పండుగల సమయాల్లో ఏ తనఖా అక్కర్లేకుండా ఇచ్చే రుణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
రుణాలు పొందే ముందు ఇవి తెలుసుకోండి..
మొదట మీకు ఏ తరహా రుణం కావాలో నిర్ణయించుకోండి. రుణాలు సులభంగా లభ్యమవుతున్న ప్రస్తుత సమయాల్లో ఇది చాలా ముఖ్యం. పండుగల సమయాల్లో కొనుగోలు చేసే టీవీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజరేటర్ వంటి వాటికి వ్యక్తిగత రుణం తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా సంస్థలు కొన్ని షరతులతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు జీరో కాస్ట్ ఈఎంఐ పేరుతో రుణాలు ఇస్తున్నాయి. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇవి ఉత్తమం.