తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎల్‌ఐసీ లాభం రూ.1,437 కోట్లు- మారుతీ సుజుకీ డీలా.. - మారుతీ సుజుకీ లాభాలు

LIC profit 2022: భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను గడించింది. తొలి ఆరు నెలల కాలానికి రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మారుతీ సుజుకీ సంస్థ లాభం 48 శాతం తగ్గింది.

LIC MARUTI
LIC net profit 2022

By

Published : Jan 26, 2022, 7:03 AM IST

LIC profit 2022: ఐపీఓకు రాబోతున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలానికి (ఏప్రిల్‌-సెప్టెంబరు) రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.6.14 కోట్లు మాత్రమే. కొత్త వ్యాపార ప్రీమియం వృద్ధి రేటు 394.76 శాతం నుంచి 554.1 శాతానికి చేరింది. మొత్తం నికర ప్రీమియం రూ.1.84 లక్షల కోట్ల నుంచి రూ.1,679 కోట్లు పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియం- పెట్టుబడులపై ఆదాయం రూ.17,404 కోట్లు పెరిగి రూ.3.35 లక్షల కోట్లుగా నమోదైంది. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.15,726 కోట్ల మేర పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరింది. వడ్డీ, డివిడెండ్లు, అద్దెల ద్వారా వచ్చిన ఆదాయం రూ.10,178 కోట్లకు చేరింది. పెట్టుబడుల విక్రయాలు/రిడెమ్షన్‌ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.10,965 కోట్లకు పెరిగింది. ఎల్‌ఐసీ వాటా మూలధనం రూ.6,325 కోట్లకు చేరింది.

LIC net profit 2022

వ్యక్తిగత జీవిత (నాన్‌-లింక్డ్‌) ప్రీమియాలు రూ.7,262 కోట్లు పెరిగి రూ.1.13 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత పింఛన్‌ (నాన్‌-లింక్డ్‌) ప్రీమియాలు రూ.4,432 కోట్లు పెరిగి రూ.5,636 కోట్లకు చేరాయి. బృంద (నాన్‌-లింక్డ్‌) ప్రీమియాలు రూ.90 కోట్లు పెరిగి రూ.66,295 కోట్లకు చేరాయి. వ్యక్తిగత జీవిత (లింక్డ్‌) మొత్తం ప్రీమియం రూ.737.08 కోట్లు పెరిగి రూ.1,085 కోట్లకు చేరింది. పాలసీదారుల పెట్టుబడులు రూ.5.9 లక్షల కోట్లు పెరిగి రూ.37.72 లక్షల కోట్లకు చేరాయి. వాటాదార్ల పెట్టుబడులు రూ.56.17 కోట్లు పెరిగి రూ.6,311 కోట్లకు చేరాయి. 2021 ఏప్రిల్‌-సెప్టెంబరులో నిలకడ నిష్పత్తి (ప్రీమియం ఆధారంగా) 78.18 శాతం, సాల్వెన్సీ నిష్పత్తి 183.37 శాతంగా నమోదయ్యాయి.

48% తగ్గిన మారుతీ లాభం

Maruti Suzuki net profit:దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.1,041.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.1,996.70 కోట్లతో పోలిస్తే ఇది 47.82 శాతం తక్కువ. సెమీకండక్టర్ల కొరత వల్ల ఉత్పత్తి-విక్రయాలు తగ్గడం, ముడిపదార్థాల ధరలు పెరగడంతో లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.23,471.3 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.23,253.3 కోట్లకు పరిమితమైంది. మొత్తం వాహన విక్రయాలు 4,95,897 నుంచి 13.1% తగ్గి 4,30,668 గా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సరఫరాలో అంతరాయం వల్ల సమీక్షా త్రైమాసికంలో 90,000 వాహనాల ఉత్పత్తి తగ్గిందని సంస్థ వివరించింది. ‘వాహనాలకు గిరాకీ బాగానే ఉంది. డిసెంబరు ఆఖరుకు 2,40,000కు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ సరఫరా క్రమంగా మెరుగవుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో పూర్తి సామర్థ్యంతో వాహన ఉత్పత్తి చేస్తామ’ని కంపెనీ తెలిపింది.

Maruti Suzuki news

స్టాండలోన్‌ ప్రాతిపదికన, కంపెనీ నికర లాభం రూ.1,941.4 కోట్ల నుంచి రూ.1,011.3 కోట్లకు తగ్గింది. నికర విక్రయాలు రూ.22,236.70 కోట్ల నుంచి రూ.22,187.60 కోట్లకు తగ్గాయి. దేశీయ విపణిలో వాహన విక్రయాలు 4,67,369 నుంచి 3,65,673కు తగ్గాయి. వాహన ఎగుమతులు మాత్రం 28,528 నుంచి గణనీయంగా పెరిగి 64,995కు చేరాయి. 2021-22 ఏప్రిల్‌- డిసెంబరులో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.2,003.7 కోట్లకు తగ్గింది. 2020-21 ఇదే కాల లాభం రూ.3,148 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.46,337.50 కోట్ల నుంచి రూ.61,580.60 కోట్లకు చేరింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:బడ్జెట్​పై సామాన్యుల భారీ ఆశలు- పన్ను రేట్లు తగ్గుతాయా?

ABOUT THE AUTHOR

...view details