తెలంగాణ

telangana

ETV Bharat / business

LIC IPO: ఈ నెలలోనే కీలక ముందడుగు! - ఎల్​ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వ ఆదాయ లక్ష్యం

ప్రభుత్వ రంగ అతిపెద్ద సంస్థ ఎల్​ఐసీ ఐపీఓ (LIC IPO)కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలలోనే ఐపీఓకోసం మర్చెంట్​ బ్యాంకర్ల ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి లోపు ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు.

LIC IPO latest IPO
ఎల్​ఐసీ ఐపీఓ అప్​డేట్స్​

By

Published : Jul 4, 2021, 5:05 PM IST

ఎల్‌ఐసీ ఐపీఓ(LIC IPO)కు సంబంధించి ఈ నెలలో కీలక ముందడుగు పడనుంది. ఈ ఐపీఓకు సంబంధించిన మర్చెంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు జులైలో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించనుంది. జనవరి నాటికి ఎల్‌ఐసీని ఐపీఓకు తీసుకురావాలనే ప్రణాళికతో పనిచేస్తోంది. ఇప్పటికే ఎల్‌ఐసీ విలువను మదింపు చేసేందుకు ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ జనవరిలో 'మిల్లిమ్యాన్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియా'ను నియమించింది. భారత కార్పొరేట్‌ చరిత్రలో (Biggest IPO in India) ఇదే అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీంతోపాటు ఎల్‌ఐసీ విక్రయానికి అవసరమైన బడ్జెట్‌ సవరణలను ఇప్పటికే నోటిఫై చేసినట్లు వెల్లడించాయి.

'రానున్న వారాల్లో మేము మర్చెంట్‌ బ్యాంకర్ల నియామకం కోసం బిడ్లను ఆహ్వానించనున్నాము. ఇప్పటికే సంస్థాగత మదుపరులతో చర్చలు జరుగుతున్నాయి. నవంబర్‌ చివరి నాటికి రెగ్యులేటరీల అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం' అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఐపీఓలో దాదాపు 10శాతం వాటాలను పాలసీదార్ల కోసం రిజర్వు చేసినట్లు స్పష్టతనిచ్చారు.

చట్ట సవరణలు..

ఎల్‌ఐసీ అమెండ్‌మెంట్‌ చట్టాన్ని ఆర్థిక చట్టంలో భాగంగా చేశారు అధికారులు. ఆ తర్వాత ఐపీఓకు అవసరమైన చట్టపరమైన సవరణలు చేస్తున్నారు. డెలాయిట్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ను ఐపీఓ లావాదేవీల సలహాదారులుగా నియమించారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరడానికి ఎల్‌ఐసీ లిస్టింగ్‌ చాలా కీలకమైంది. ఈ ఏడాది వాటాల విక్రయం ద్వారా రూ.1.75లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐపీఓకు వీలుగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిబంధనలు-1956కు కొన్ని మార్పులు చేస్తూ, జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనుంది. దీంతోపాటు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లకు బదులుగా 62 ఏళ్లకు పెంచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లే. ఎస్‌బీఐలోనూ ఇదే నిబంధన ఉంది. ఇకపై ఛైర్మన్‌ను నియమించేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వ్యవధి, 62 ఏళ్ల వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పుడు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ ఐపీఓకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం తొమ్మిది నెలలు పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అప్పటి లోపు లిస్టింగ్ ప్రక్రియ పూర్తవనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details