గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా భారతీయ-అమెరికన్ సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్.. ఆల్ఫాబెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ తాజా పదోన్నతితో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు.
పదవీ విరమణ...
లారీ పేజ్, సెర్గీ బ్రిన్.. తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ఆల్ఫాబెట్ స్థిరపడిందని, గూగుల్ ఇతర అనుబంధ సంస్థలు స్వతంత్రంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో సంస్థను సమర్థవంతంగా నడిపే ఇతర మార్గాలు ఉన్నప్పుడు తాము ఇదే పదవుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు.
"ఆల్ఫాబెట్, గూగుల్‌లకు ఇకపై ఇద్దరు సీఈఓలు, ప్రెసిడెంట్ ఉండనవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందర్ పిచాయ్ మాత్రమే సీఈఓగా ఉంటారు. గూగుల్ కార్యనిర్వహక బాధ్యతలు నిర్వహిస్తారు. సంస్థ తరఫున జవాబుదారీగా ఉంటారు." - లారీ పేజ్, సెర్గీ బ్రిన్, గూగుల్ సహవ్యవస్థాపకులు.