తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ సంస్థ​పై అమెరికా న్యాయశాఖ దావా - గూగుల్​పై కేసు

ఇంటర్నెట్​లో గుత్తాధిపత్యానికి ప్రయత్నించిందని గూగుల్​ సంస్థపై అమెరికా న్యాయవిభాగం దావా వేసింది. పోటీదారులు, వినియోగదారులకు హాని కలిగించేలా గూగుల్‌ కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను గూగుల్​ ఖండించింది. వేరే ప్రత్యామ్నాయాలు దొరక్కపోవడం వల్ల వినియోగదారులే స్వచ్ఛందంగా వాడుతున్నారని తెలిపింది.

US-GOOGLE-LAWSUIT
గూగుల్

By

Published : Oct 21, 2020, 8:22 AM IST

ఇంటర్నెట్‌ సెర్చ్‌, ఆన్‌లైన్‌ ప్రకటన రంగంలో నిబంధనలకు విరుద్ధంగా ఆధిపత్యానికి యత్నిస్తోందంటూ గూగుల్ సంస్థపై అమెరికా న్యాయ విభాగం దావా వేసింది. పోటీదారులు, వినియోగదారులకు హాని కలిగించేలా గూగుల్‌ కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది.

20 ఏళ్ల కిందట మైక్రోసాఫ్ట్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన తర్వాత... ఈ రంగంలో పోటీని రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యగా దీన్ని భావిస్తున్నారు. యాపిల్‌, అమెజాన్, ఫేస్‌బుక్‌లపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కన్నా ముందే దీనిపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

11 రాష్ట్రాల ఆరోపణలు..

పోటీకి హాని కల్గించేలా మినహాయింపు పద్ధతుల ద్వారా గూగుల్‌ గుత్తాధిపత్యానికి ప్రయత్నించిందని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ జెఫ్‌ రోసెన్‌ తెలిపారు. అమెరికా ప్రభుత్వ న్యాయ విభాగంతోపాటు 11 రాష్ట్రాలు గూగుల్‌పై ఈ ఆరోపణలు చేశాయి.

ప్రత్యామ్నాయం లేనందునే..

మొబైళ్లు, కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేసినందుకు పలు సంస్థలకు గూగుల్‌ ఏటా బిలియన్ల డాలర్లను చెల్లిస్తోందని ఈ ఫిర్యాదులో ఆరోపించాయి. అయితే ఈ ఫిర్యాదు లోపభూయిష్టంగా ఉందని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ను వాడాలని ప్రజలను ఒత్తిడి చేయలేదని, వేరే ప్రత్యామ్నాయాలు దొరక్కపోవడం వల్ల వారే స్వచ్ఛందంగా వాడుతున్నారని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'ఇంటర్​నెట్​ అంటే గూగులేనా..? లోగుట్టు ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details