తెలంగాణ

telangana

ETV Bharat / business

2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు - స్పేస్​ టక్నాలజీపై ఎయిర్​టెల్ ప్రకటన

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం దిగ్గజం జియో వడివడిగా అడుగులు వేస్తోంది. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ అధికారికంగా వెల్లడించారు.

Mukesh Ambani jio 5g
జియో 5జీ సేవలపై అంబానీ ప్రకటన

By

Published : Dec 8, 2020, 11:49 AM IST

Updated : Dec 8, 2020, 1:05 PM IST

భారత్​లో 5జీ సేవలు ప్రారంభించేందుకు టెలికాం సంస్థలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మంగళవారం ప్రారంభమైన.. 'ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020(ఐఎంసీ)'లో పాల్గొన్న టెలికాం సంస్థల అధినేతలు 5జీ సేవలు అందుబాటులోకి వస్తే భారత డిజిటల్ వ్యవవ్థ మరింత పటిష్ఠమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2021 ద్వితీయార్ధంలో...

2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఐఎంసీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని గుర్తుచేశారు. ఈ ఆధిపత్యం కొనసాగించడానికి అవసరమైన 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా ప్రారంభించేందుకు విధానపరమైన నిర్ణయాలు భారత్‌ త్వరగా తీసుకోవాలన్నారు.

రిలయన్స్‌ తీసుకొచ్చే 5జీ నెట్‌వర్క్‌ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిందని అంబానీ వివరించారు. వీటి హార్డ్‌వేర్‌, టెక్నాలజీ మొత్తం దేశంలోనే సిద్ధం కానున్నాయని చెప్పారు.

మోదీ‌ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా జియో 5జీ ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికీ 2జీ వినియోగిస్తూ చాలా సేవలకు దూరంగా ఉన్నవారిని స్మార్ట్‌ఫోన్లు వినియోగించి అభివృద్ధి ఫలాలు అందుకొనేలా చేసేందుకు ప్రభుత్వం నుంచి విధానపరమైన జోక్యం అవసరమన్నారు అంబానీ.

స్పేస్​ కమ్యునికేషన్​లోకి ఎయిర్​టెల్!

5జీపై ప్రపంచ పెట్టుబడుల ప్రయోజనాలను రెండు-మూడేళ్లలో భారత్​ అనుభూతి చెందుతుందని భారతీ ఎయిర్​టెల్ ఛైర్మన్​ సునీల్ మిత్తల్ ఐఎంసీలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లలో 5జీ టెక్నాలజీకి స్థిరత్వం ఏర్పడి.. ఉపకరణాల ధరలు దిగొస్తాయని వివరించారు. ఫలితంగా వాటి లభ్యత భారీగా పెరుగుతుందన్నారు.

కమ్యూనికేషన్​కు తదుపరి లక్ష్యం అంతరిక్షమేనన్నారు సునీల్ మిత్తల్. స్పేస్​ కమ్యూనికేషన్​ సాంకేతికతను​ ఎయిర్​టెల్ సద్వినియోగం చేసుకోగలదని ధీమా వ్యక్తం చేశారు.

దేశీయంగా 5జీ ఉపకరణాల తయారీ

ప్రముఖ టెలికాం ఉపకరణాల సంస్థ నోకియా.. దేశీయంగా 5జీ ఉపకరణాల ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. తర్వాతి తరం సాంకేతికకను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్న దేశాలకు వీటిని సరఫరా చేస్తామని పేర్కొంది.

భారత్​లో 5జీ సేవల ప్రారంభం అనేది.. 5జీ స్పెక్ట్రమ్ వేలంపై ఎప్పుడు జరుగుతుందనేదానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది నోకియా.

ఇదీ చూడండి:'విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం భారత్​'

Last Updated : Dec 8, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details