తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఫీచర్లు, సూపర్​ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్​' - ాేపో ోసవోలగ

అంతర్జాల రంగంలో మరో సంచలనానికి రంగం సిద్ధం చేసింది రిలయన్స్. ఎప్పటి నుంచో జియో ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గిగా ఫైబర్​ వాణిజ్య సేవలను ఈ ఏడాది సెప్టెంబర్​ 5 నుంచే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సంస్థ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలను వాటాదారులకు వివరించారు అధిపతి ముకేశ్​ అంబానీ.

అదిరే ఫీచర్లు, సూపర్​ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్​'

By

Published : Aug 12, 2019, 1:32 PM IST

Updated : Sep 26, 2019, 6:03 PM IST

అదిరే ఫీచర్లు, సూపర్​ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్​'

బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్​ రంగంలో సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేసింది రిలయన్స్​ జియో. మార్కెట్​ వర్గాలు, టెలికాం వినియోగదారులు.. ఇలా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన 'జియో గిగా ఫైబర్​' సేవలపై స్పష్టతనిచ్చింది. ముంబయిలో జరిగిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ.

బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్​, ల్యాండ్​లైన్​ సేవలన్నింటినీ ఒకే దగ్గర అందించే 'జియో గిగా ఫైబర్​' వాణిజ్య సేవలను ఈ ఏడాది సెప్టెంబర్​ 5న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సామాన్య ప్రజలందరికీ అందుబాటు ధరలలో రూ. 700- 10, 000 మధ్య సేవలు లభ్యమవుతాయని వెల్లడించారు. కనిష్ఠంగా 100 ఎంబీపీఎస్​ నుంచి గరిష్ఠంగా 1 జీబీపీఎస్​ వరకు వేగంతో డేటా అందుతుందని చెప్పారు.

  • జియో గిగా ఫైబర్​ వాణిజ్య సేవలు ప్రారంభం-సెప్టెంబర్​ 5
  • కనీస ప్రారంభ ధర.. రూ. 700
  • గరిష్ఠ ధర.. రూ. 10,000
  • వేగం.. 100 ఎంబీపీఎస్​ నుంచి 1 జీబీపీఎస్​ వరకు

రిలయన్స్​ జియో 340 మిలియన్​ వినియోగదారుల మార్కును చేరిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు అంబానీ.

హెచ్​డీ టీవీ, సెట్​ టాప్​ బాక్స్​​ ఉచితం...

జియో గిగా ఫైబర్​ సేవల కింద అనేక ఆఫర్లు ప్రకటించారు అంబానీ. జియో వెల్​కమ్​ ఆఫర్​ కింద సెట్​టాప్​ బాక్స్​ సహా ఫుల్​ హెచ్​డీ టీవీ ఉచితంగా లభిస్తాయని తెలిపారు. అయితే.. ఇందుకోసం ఏడాది చందాను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. హెచ్​డీ టీవీ వద్దనుకుంటే హోం కంప్యూటర్​ లేదా 4కే సెట్​టాప్​ బాక్స్​ అందిస్తామని తెలిపారు.

జియో సెట్​టాప్​ బాక్స్​ ద్వారా వీడియో కాల్​ సేవలు అందించనుంది రిలయన్స్​ జియో. రూ. 500తో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వీడియో కాల్ సేవలు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

వచ్చే జనవరి నుంచి ఐఓటీ...

2020 జనవరి నుంచి ఇంటర్​నెట్​ ఆఫ్​ థింగ్స్​(ఐఓటీ) సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆర్​ఐఎల్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. వచ్చే రెండేళ్లలో 2 బిలియన్​ వినియోగదారులకు ఈ ఐఓటీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఫలితాల్లో ముందంజ...

రిలయన్స్​ ఇండస్ట్రీస్​, రిలయన్స్​ జియో... ఇంకా అనుబంధ సంస్థలన్నీ మంచి ఫలితాలతో దూసుకెళ్తున్నాయన్నారు అంబానీ. సంస్థ ప్రగతి, ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికల్ని ఏజీఎం వేదికగా వాటాదారులతో పంచుకున్నారు.

గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ రికార్డ్ సృష్టించిందని ప్రకటించారు. రిలయన్స్​ రిటైల్​ రూ. లక్షా 30 వేల కోట్ల వ్యాపారం చేసిందని వెల్లడించారు. భారత దేశంలో అత్యధిక పన్నులు చెల్లించిన సంస్థగా ఆర్​ఐఎల్​ నిలిచిందని గుర్తుచేశారు.

సౌదీ అరాంకోతో అతిపెద్ద ఒప్పందం...

పెట్రో కెమికల్స్​ రంగంలో.. సౌదీ అరాంకోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏజీఎంలో ప్రకటించారు అంబానీ. ఆ సంస్థ దాదాపు 20 శాతం పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యం అని వెల్లడించారు రిలయన్స్​ ఛైర్మన్​.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు ముకేశ్​. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు. దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 కల్లా భారత్ 10 వేల ట్రిలియన్​ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అంచనా వేశారు.

ఇదీ చూడండి:జియో గిగాఫైబర్​తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్​డే ఫస్ట్​ షో'

Last Updated : Sep 26, 2019, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details