జియో 4జీకి 50 కోట్ల వినియోగదారులను చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని వార్షిక సర్వ సభ్య సమావేశంలో రిలయన్స్ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది జియో. 4జీ టారిఫ్లు పెరిగే అవకాశం లేదని సంకేతాలిచ్చింది. తాజాగా... జియో ఫీచర్ ఫోన్ను మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
జియో ఫోన్-2తో మారిన ప్రణాళిక
తక్కువ ధరలో 4జీ సేవలు పొందేందుకు వీలుగా తీసుకువచ్చిన జియో ఫోన్-1 భారీ విజయాన్ని అందుకుంది. ఈ ప్రోత్సాహంతో ఫీచర్ ఫోన్-1కు కొనసాగింపుగా జియో-2ను మార్కెట్లోకి విడుదల చేసింది రిలయన్స్. అయితే ఇది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ దెబ్బతో జియో-2 మార్కెటింగ్ తగ్గించింది రిలయన్స్. జియో ఫోన్-3ని తీసుకురావాలన్న ఆలోచననూ రిలయన్స్ విరమించుకుందని టెక్ వర్గాల అంచనా. కొత్త ఫోన్లను తీసుకురావడం మానేసి.. ఉన్న ఫోన్లకే కొత్త అప్డేట్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
టెక్ నిపుణుల ప్రకారం.. ఫీచర్ ఫోన్లకు సరికొత్త అప్డేట్లను జోడించి వాటిని మార్కెటింగ్ చేయాలని జియో భావిస్తోంది.