'జియో' 4జీతో మొబైల్ ఇంటర్నెట్ రంగంలో సంచలనం సృష్టించింది జియో. ఇప్పుడు మరోసారి ఫైబర్ ఇంటర్నెట్ రంగంలో సత్తా చాటేందుకు జియో ఫైబర్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. అందరూ అనుకున్నట్లుగానే అదిరే ప్రారంభ ఆఫర్లు తెచ్చింది. అయితే అందరికి వచ్చే సాధారణ సందేహం జియో ఫైబర్‌కు.. ప్రస్తుతం మార్కెట్లో ఫైబర్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న సంస్థలకు తేడా ఏంటని. ఆ తేడాలు.. ఇతర సంస్థలతో పోలిస్తే జియో ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అన్నింటి కంటే చౌక..
జియో ఫైబర్ కనీస ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్‌గా నిర్ణయించింది. ఇందుకు రూ.699 నెలవారీ చందాను వసూలు చేయనున్నట్లు తెలిపింది. మార్కెట్లో ఇతర సంస్థలు అందిస్తున్న కనీస వేగం, ధరతో పోలిస్తే 35 - 45 శాతం వరకు చౌకగా జియో ఫైబర్ సేవలందిస్తోంది.
ఓటీటీ సేవలు ఉచితం
రూ.699 ప్లాన్ ఉన్న వినియోగదారులకు మూడు నెలల పాటు జియో సావన్, జియో సినిమా సహా కొన్ని ఓటీటీ యాప్‌లు (అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, వూట్ వంటివి) ఉచితంగా లభించనున్నాయి. రూ.849 ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు 3 నెలల పాటు ఓటీటీ యాప్‌లన్నీ ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.1,299 ఆ పై ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు ఏడాది పాటు ఓటీటీ యాప్‌ల సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు.