ఇటీవల తాత్కాలికంగా మూతపడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. జీతాల బకాయిల చెల్లింపు, అత్యవసర నిధుల ప్రక్రియలో వేగవంతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మూతపడిన జెట్ ఎయిర్వేస్లో సుమారు 23 వేల మంది పని చేస్తున్నారు.
సంస్థ భవిష్యత్తుపై అనిశ్చితి మధ్య రెండు ఉద్యోగ సంఘాలు భారత పైలెట్ల సంక్షేమ సంఘం (ఎస్డబ్ల్యూఐపీ), జెట్ విమాన నిర్వహణ ఇంజనీర్స్ సంక్షేమ సంఘం (జేఏఎమ్ఈడబ్ల్యూఏ)లు తమ బకాయిల చెల్లింపునకు సహాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశాయి.
"ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి సూచించండి. అత్యవసర నిధులు సమకూర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని సైతం కోరుతున్నాం. ఈ పరీక్షా కాలంలో ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం క్లిష్టంగా మారుతోంది. "
- లేఖలో ఉద్యోగులు