తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్ ఎయిర్​వేస్ పాక్షిక మూసివేత - closed

జెట్​ ఎయిర్​వేస్​ సంస్థ విమాన సేవలు నిలిచిపోయాయి. తక్షణ రుణసాయంగా రూ. 400 కోట్లను అందివ్వాలన్న ప్రతిపాదనను బ్యాంకుల కన్సార్టియం తిరస్కరించిన నేపథ్యంలో జెట్​ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి నుంచి సేవలను రద్దు చేసింది.

జెట్ ఎయిర్​వేస్ పాక్షిక మూసివేత

By

Published : Apr 18, 2019, 6:49 AM IST

Updated : Apr 18, 2019, 8:03 AM IST

జెట్ ఎయిర్​వేస్ పాక్షిక మూసివేత

25 ఏళ్ల జెట్​ ఎయిర్​వేస్ ​ ప్రస్థానానికి బ్రేక్ పడింది. ఆర్థిక ఇబ్బందులతో విమాన సేవల రద్దుకు నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. విమాన సేవలను కొనసాగించేందుకు తక్షణ రుణసాయంగా రూ.400 కోట్లు అందివ్వాలన్న జెట్ ప్రతిపాదనలను బ్యాంకర్లు తిరస్కరించిన నేపథ్యంలో మూసివేతకు సిద్ధమైంది.

"తక్షణ రుణసాయాన్ని బ్యాంకర్లు తిరస్కరించారు. ఫలితంగా ఇంధనం సహా ఇతర కార్యకలాపాలకు చెల్లింపులు చేయలేం. మా జాతీయ, అంతర్జాతీయ విమాన సేవల్ని తక్షణం రద్దు చేస్తున్నాం." -జెట్ ఎయిర్​వేస్ ప్రకటన

జెట్ నిర్ణయంతో 20వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. రద్దు చేసిన సర్వీసుల అడ్వాన్స్​డ్​ టికెట్​ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు బ్యాంకులకు రూ.8,500 కోట్లు బకాయిలు ఉన్నాయి.

జెట్ టికెట్ ధర ఎక్కువగా ఉండటం పోటీ కంపెనీలకు అవకాశంగా మారింది. దేశంలోని ప్రతిష్టాత్మక సర్వీసులు నడిపేందుకు జెట్​కున్న అనుమతుల్ని ఇండిగో, స్పైస్​జెట్ వంటి కంపెనీలు చేజిక్కించుకున్నాయి.

సాధారణంగా వేసవిలో విమాన సర్వీసులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో జెట్ మూసివేత ప్రకటనతో విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

కొనసాగుతున్న తుది దశ ప్రక్రియ...

ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం జెట్​లో వాటాలను విక్రయానికి సంబంధించి తుది ప్రక్రియ చేపడుతోంది. 32.1 నుంచి 75 శాతం మేర షేర్ల కొనుగోలుకు పెట్టుబడిదారులకు ఇటీవల ఆహ్వానం పలికింది. ఎతిహాద్​, ఇండిగో లాంటి ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి.

అందరికీ ఉద్యోగాలు కష్టమే...

జెట్​ఎయిర్​వేస్​లో పనిచేస్తున్న 20వేలమంది ఉద్యోగుల భవితవ్యంపై ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్​ దుబే స్పందించారు. అందరికీ ఉద్యోగ భద్రత కష్టమేనన్నారు. కన్సార్టియంతో చర్చలు జరిపి నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు.

జెట్ మూసివేతతో ఆ సంస్థ ఉద్యోగుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓ ఉద్యోగి కుమార్తె ఆవేదన ఆన్​లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. "నేను జెట్​కు చెందిన ఉద్యోగి కుమార్తెను. మా నాన్న 20 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నారు. ఈ దశలో ఉద్యోగం కోల్పోవడం మా కుటుంబానికి ఎదురుదెబ్బ. మా కలలు, ఆశలతో ప్రస్తుతం రాజీపడాలి. జెట్​ ఎయిర్​వేస్​కు ఆర్థిక చేయూత అందించండి" అని రాసుకొచ్చింది.

జెట్ ప్రస్థానం

జెట్​ ఎయిర్​వేస్​ను నరేశ్ గోయల్ స్థాపించారు. సాధారణ అమ్మకాల ప్రతినిధిగా జీవితాన్ని ప్రారంభించారు గోయల్. తన 25 ఏళ్ల ప్రస్థానంలో జెట్ ఎయిర్​ వేస్ కోట్లమందికి సేవలందించింది. గత ఐదేళ్లలో భారత్​లో మూతపడిన విమానయాన కంపెనీల్లో జెట్ ఏడోది.

2010 సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డ జెట్ నిధుల లేమి సమస్యతో జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరింది. గత డిసెంబర్​లో ఒక రోజుకు 123 విమానాలతో 650 ప్రయాణాలు నడిపించింది జెట్. ఆఖరి విమానం బుధవారం రాత్రి అమృత్​సర్​ నుంచి దిల్లీకి ప్రయాణీకుల్ని చేరవేసింది.

Last Updated : Apr 18, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details