తెలంగాణ

telangana

ETV Bharat / business

హోదా రద్దుతో జమ్ముకశ్మీర్​కు ఇలా మేలు..! - పరిశ్రమలు

ప్రత్యేక హోదా తొలగింపుతో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల రూపు రేఖలు మారనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వ్యాపారాలకు భారీ అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇంతకీ ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యాపార అవకాశాలు ఏంటి? తాజా పరిస్థితులతో కశ్మీరీలకు వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

హోదా రద్దుతో జమ్ముకశ్మీర్​కు ఇలా మేలు!

By

Published : Aug 11, 2019, 1:31 PM IST

Updated : Sep 26, 2019, 3:27 PM IST

దాదాపు 70 ఏళ్లుగా జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న అధికరణ 370ని రద్దు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా రాష్ట్రాన్ని​ జమ్ముకశ్మీర్​, లద్దాఖ్..​ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాలతో కేవలం రాజకీయంగానే కాదు.. వ్యాపార, వాణిజ్య పరంగానూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ మార్పులు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా వచ్చే మార్పులు ఏంటో తెలుసుకుందాం.

పర్యటకం, ఆతిథ్యం

పర్యటకం, ఆతిథ్యం

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్ ప్రాంతాలకు ప్రపంచ అత్యుత్తమ పర్యటక రంగాలుగా అభివృద్ధి చెందే సత్తా ఉంది. ఉమ్మడి జమ్ముకశ్మీర్ రాష్ట్ర జీడీపీలో 15 శాతం టూరిజం నుంచే వచ్చేది. దాదాపు 50-60 శాతం మంది స్థానికులు సంబంధిత రంగాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ పెట్టుబడుల లేమి కారణంగా టూరిజం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండిపోయింది.

మారిన పరిస్థితులతో టూరిజంలోకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా పర్యటకులు, యాత్రికులు, ఆధ్యాత్మిక, ఆరోగ్య పర్యటకులు పెరిగి.. పర్యటక, అతిథ్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

హార్టికల్చర్​, ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు

హార్టికల్చర్​, ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు

జమ్ముకశ్మీర్​లో ఉండే నేలలు విస్తారమైన సహజ వనరులతో కూడుకున్నవి. ఇవి వివిధ రకాల పండ్లు పండించేందుకు అనుకూలమైనవి. 2017-18లో చూస్తే.. భారత ఆపిల్ పండ్ల ఉత్పత్తిలో 76.25 శాతం ఉమ్మడి జమ్ముకశ్మీర్ రాష్ట్రానిదే. ఈ గణాంకాలు చాలు అక్కడ పండ్ల ఉత్పత్తికి ఉన్న సానుకూలతలు చెప్పేందుకు.

ఉద్యానవనాల​కు అనుకూల ప్రాంతాలైనందున జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలకు భారీ అవకాశాలున్నాయి. ఈ-కామర్స్ వ్యాపారాలకూ ఇది కలిసొచ్చే అంశమే. అయితే ఇవన్నీ జరగాలంటే కొనుగోలు శక్తిని మెరుగు పరచాల్సిన అవసరం ఉంది.

వైవిధ్య వ్యవసాయ వాతావరణ పరిస్థితులు జమ్ముకశ్మీర్​లో.. హార్టికల్చర్ రంగంలో పెట్టుబడులకు భారీ ఆవకాశాలు సృష్టించే అవకాశం ఉంది.

సమాచార, కమ్యూనికేషన్ రంగం

సమాచార, కమ్యూనికేషన్ రంగం

ఉత్తరాది దేశాలైన ఫిన్​ల్యాండ్, డెన్​మార్క్​, నార్వే, స్వీడన్​లు గత పదేళ్ల నుంచి డేటా కేంద్రాల వ్యాపారాల్లో భారీ అభివృద్ధిని చూస్తున్నాయి. ఇందుకు కారణం అక్కడ ఉండే శీతల వాతావరణ పరిస్థితులే.

సమాచార, సాంకేతిక మౌలిక సదుపాయాలకు తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతాలు అనుకూలమైనవి. ఇందుకు జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాలు సరిగ్గా సరిపోతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిబంధనలు సరళీకృతమయ్యాయి. కాబట్టి గూగుల్, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారత్​ సహా చైనా వంటి చుట్టుపక్కల దేశాల కార్యకలాపాలు నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్​ను కేంద్రంగా ఎంచుకునే అవకాశం ఉంది.

ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్​లో ఒక బీపీఓను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రైవేటు సంస్థలూ జమ్ముకశ్మీర్​లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు.

రియల్​ ఎస్టేట్​

రియల్​ ఎస్టేట్​

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం స్థిరాస్తి విలువ మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ. శ్రీనగర్​లోని రద్దీగా ఉండే 'పంథా చౌక్'లో చదరపు అడుగు ఇంటి స్థలం రూ.2,300గా ఉంది. ఇది దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే దేశంలోని టైర్​ 2 పట్టణాలతో పోల్చినా తక్కువే. దీన్ని బట్టి జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లలో రియల్​ఎస్టేట్​ రంగం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో 50 శాతం మేర ధరలు పెరగొచ్చని అంచనా. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుతో దేశంలోని ఎవరైనా జమ్ముకశ్మీర్​లో స్థిరాస్తి క్రయ విక్రయాలు జరిపేందుకు వీలు కలకగడమే ఇందుకు ప్రధాన కారణం.

హస్తకళల పరిశ్రమలు

హస్తకళల పరిశ్రమలు

జమ్ముకశ్మీర్.. తివాచీలు, సిల్క్​, శాలువాలు, బుట్టల అల్లికలకు, రాగి, వెండి హస్త కళలకు, పేపర్ పరిశ్రమలకు నెలవు. ఈ పరిశ్రమల్లో పెట్టుబడులు లేని కారణంగా ఇవి జమ్ముకశ్మీర్​కు మాత్రమే పరిమితమయ్యాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయా రంగాలకు భారీ పెట్టుబడులు వచ్చే అవకాశముంది. వీటి ద్వారా డిమాండ్, సప్లయి పెరిగి.. ప్రపంచ వ్యాప్తంగా జమ్ముకశ్మీర్ హస్తకళలు ప్రాచుర్యం పొందుతాయనడంలో సందేహం లేదు.

భూతల స్వర్గంగా పిలిచే జమ్ముకశ్మీర్​లో గత కొన్ని దశాబ్దాలుగా.. ఉగ్రవాదం కారణంగా అభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయంతో అన్ని రంగాల్లో జమ్ముకశ్మీర్​ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆశిద్దాం.

ఇదీ చూడండి: నియమాలు ఉల్లంఘిస్తున్న యూట్యూబ్​ స్టార్స్

Last Updated : Sep 26, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details