ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను రాబట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ). జులై- సెప్టెంబర్‌కు గాను రూ. 6,360.05 కోట్ల నికర లాభం సంపాదించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 6,227.31గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ. 5,941.37 కోట్లుగా ఉంది.
జులై- సెప్టెంబర్ మధ్యలో దాదాపు 19 మిలియన్ టన్నుల ఇంధనాన్ని విక్రయించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 17.7 మిలియన్ టన్నులు విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 15.27 మిలియన్ టన్నుల ముడిచమురును ఇంధనంగా మార్చినట్లు తెలిపింది. గతేడాది 13.96 మిలియన్ టన్నుల ముడిచమురు ఇంధనంగా మార్చినట్లు పేర్కొంది.